పోలింగ్‌కు వలస దెబ్బ! | Migration effect in narayankhed polling | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు వలస దెబ్బ!

Published Sat, Feb 13 2016 2:09 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

పోలింగ్‌కు వలస దెబ్బ! - Sakshi

పోలింగ్‌కు వలస దెబ్బ!

51 వేల మంది ఓటుకు దూరం
కొందరిది భుక్తి బాట
మరికొందరిది భక్తి యాత్ర
అయోమయంలో అభ్యర్థులు


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలింగ్ కేంద్రాలు..ఈవీఎంలు.. ఇంక్ ప్యాడ్లు.. గులాబీ పూలు.. మజ్జిగ ప్యాకెట్ల.. పోలీ సు పహారా.. వెరసి ఉప ఎన్నికకు  సర్వం సిద్ధమయ్యాయి. ఎన్నికల సిబ్బంది, సామగ్రితో శుక్రవారం సాయంత్రానికే గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఇక ఓట్ల పండుగే..!

 తెర వెనుక: పొట్ట చేత పట్టుకొని వలస పోయిన కూలీలు ఇంకా గూటికి చేరలేదు.. మరో వైపు పక్కరాష్ట్రంలో పండరీ దేవుని జాతరంటూ భక్త జనం వరుస కట్టారు... ఇంకోవైపు ‘క్షుద్ర శక్తుల’భయం చూపి నిరక్షరాస్య ఓటరును ఇంట్లోనే బంధించే ప్రయత్నమేదో జరుగుతోంది. ఓట్ల పండగ రానే వచ్చింది, కానీ ఎన్నో అడ్డంకులు. ప్రతిదీ సగటు ఓటరును ఓటుకు దూరం చేసేదే. ఇన్ని ఒడిదుడుకుల నడుమ నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ శాతం భారీగా తగ్గే ప్రమాదం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు   భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.58 లక్షల ఓట్లు అంటే 79.64 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఆధార్‌కార్డు అనుసంధానం లేకపోవడంతో ఈ ఏడాది ఎన్నికల కమిషన్ సుమారు 17.5 వేల ఓట్లను తొలగించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 95,772 మంది పురుషులు, 93,040 మంది స్త్రీ కలిపి మొత్తం 1,88,839 ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎన్నికల అధికారులు 1.37 లక్షల మంది ఓటర్లను మాత్రమే గుర్తించి వారికి ఓటరు స్లిప్పులు అందించారు. మిగిలిన 51 వేల మంది ఓటర్ల ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో ఓటరు స్లిప్పులను అందించలేకపోయారు. వీరంతా వలస కూలీలని, ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబాలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజు వరకు వీరిలో కనీసం కొందరైనా తిరిగి వస్తారనే ఆశతో ఎన్నికల అధికారులు ఓటరు స్లిప్పులను ఆయా గ్రామాల వీఆర్‌వోల దగ్గర అందుబాటులో ఉంచారు.

వలస కూలీలను ఓటింగ్ రోజున సొంత ఊర్లకు తీసుకుని రావడానికి ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు  చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్క గ్రామం నుంచి ఎంత మంది వలస వెళ్లారో గుర్తించి వారిని పోలింగ్ కేంద్రం పద్దకు పట్టుకొచ్చి, ఓటు వేయించి తిరిగి మళ్లీ వాళ్లను పంపించే బాధ్యతను ఆయా గ్రామాల్లోని పెద్ద మనుషులకు, కుల పెద్దలకు అప్పగిస్తున్నారు. ఇదే బాధ్యతను కాంగ్రెస్‌పార్టీ నేతలు గుంపు మేస్త్రీలకు అప్పగించారు. కూలీలను తీసుకువెళ్లేది గుంపు మేస్త్రీలు కనుక, వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో సులువుగా గుర్తిస్తారని కాంగ్రెస్ పార్టీ ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయే వేచి చూడాలి.

 దేవుని భక్తి..‘క్షుద్ర శక్తుల’ శాసనం..
 పోలింగ్ స్లిప్పులు తీసుకున్న వారిలో కూడా దాదాపు 20 నుంచి 25 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.  నియోజకవర్గం నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు పండరీపురం విఠలేశ్వర స్వామి జాతరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ మాసం ఏకాదశి  (ఈనెల 3న) రోజున  మొదలైన పండరీ భక్తుల ప్రయాణం, త్రయోదశి (ఈ నెల 6న) వరకు కొనసాగింది. ప్రతి పల్లెనుంచి పదుల సంఖ్యలో భక్తులు పండరి వెళ్లారు. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో పండరీ  దేవుని ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్లంతా పోలింగ్‌కు  దూరం అయినట్టే.

ఇదిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. నిరక్షరాస్యత ఓటర్లు క్షుద్ర శక్తుల భయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా కల్హేర్, కంగ్టి, మనూరు ప్రాంతంలో ఈ ‘శక్తుల’ప్రభావం తీవ్రంగా ఉంది. సగటు ఓటరును ఇంట్లోనే బంధీగా చేయడానికి ఓ వర్గం పని గట్టుకొని క్షుద్ర విద్య అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు జనం  హడలిపోతున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ మంత్రించిన ఆవాలు చల్లితే మరికొన్ని గ్రామాల్లో  ఎన్నికల కేంద్రం తలుపుల వద్ద పసుపు కుంకుమ పెట్టి వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 భయం.. భయం..
 మంత్రగాళ్లు మనుసులో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలని శాసిస్తాడో... అదే పార్టీకి గుర్తుకు ఓటు వేయాలని, లేదంటే క్షుద్ర శక్తులు బలి తీసుకుంటాయని ప్రచారం జరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. కల్హెర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్‌పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో ని ప్రజలను ‘సాక్షి’ ప్రతినిధి  పలకరించినప్పుడు జనం క్షుద్ర శక్తుల పట్ల తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేశారు. ఓ పేరు మోసిన మంత్రగానితో ఆవాలు మంత్రించి, క్షుద్ర శక్తులను పోలింగ్ తలుపుల వద్ద కాపలా పెట్టారని జనం  చెప్తున్నారు.

ఓ పార్టీకి ఓటు వేయాలని మంత్రగాడు శాసించాడో జనం చెప్తున్నారు కానీ.. మీకు ఏ వ్యక్తి చెప్పాడని అడిగితే మాత్రం బదులు రావడం లేదు. ఎవరో చెప్పుకొంటుంటే విన్నామని మాత్రమే అంటున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి ఇలా వ్యాపిస్తోంది. ఈ భయంతో ఓటర్లు ఓటు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇంట్లోనే ఉండిపోవాలనే యోచనలో చాలామంది ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement