పాలు.. కరువు!
పాలు.. కరువు!
Published Sat, Mar 18 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
జిల్లాలో తగ్గిన పాల ఉత్పత్తి
- జనాభాకు అనుగుణంగా రోజుకు 10 లక్షల లీటర్లు అవసరం
- ప్రస్తుతం 6.75లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి
- డెయిరీల్లో పాల పొడి వినియోగం
- అతీగతీ లేని ఊరూరా పశుగ్రాసం క్షేత్రాలు
- గత నాలుగు నెలల్లో 2లక్షల పాడి పశువుల అమ్మకం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. నీటి సమస్య, పశుగ్రాసం కొరత రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరువులో పశుగ్రాసం కొరతను ఎదుర్కొనేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు రూ.15.66 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేసి పశుగ్రాసం కొరతను నివారిస్తామని అధికారులు 10 నెలల నుంచి హడావుడి చేస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదు. పశుసంపదకు అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.
డెయిరీ నిర్వాహకులు పాల పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. పాల ఉత్పత్తి తగ్గడంతో ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న పాలలో నాణ్యత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజూ 220 ఎంఎల్ పాలు తీసుకోవాలి. ప్రస్తుత జిల్లా జనాభా 45 లక్షలు. ఈ ప్రకారం రోజుకు దాదాపు 10 లక్షల లీటర్ల పాలు అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు 6 లక్షల లీటర్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో పాల కొరత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది.
రోజూ పాల ఉత్పత్తి 6.75లక్షల లీటర్లు మాత్రమే..
జిల్లాలో పాడి పశువులు దాదాపు 8.25 లక్షలు. అయితే కరువు ప్రభావంతో గత రెండు నెలల్లో దాదాపు 2లక్షల పాడి పశువులను అమ్మేసినట్లు తెలుస్తోంది. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. పాల ఉత్పత్తి బాగుండాలంటే పచ్చి మేత అవసరం. కానీ పచ్చి మేతకు తీవ్ర కరువు ఏర్పడింది. ఎండు మేత కూడా అందని పరిస్థితి. మనుషులు తాగడానికే నీళ్లు లేవు. ఇక పశువుల దాహార్తి తీర్చలేని రైతులు పాడి పశువులను సైతం సంతలకు తరలిస్తున్నారు. ఇటీవలి కాలంలోనే జిల్లాలో 2లక్షల పాడిపశువుల అమ్మారంటే కరువు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మిగిలిన ఆరు లక్షల పశువుల్లో దాదాపు 4లక్షల పశువులు వట్టి పోయాయి. ప్రస్తుతం పాలిచ్చే పశువులు 2.25 లక్షలు మాత్రమే. వీటిల్లోనూ పచ్చిమేత, నీళ్లు లేకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గింది.
సగటును రోజుకు ఒక పాడి పశువు 3 లీటర్ల పాలు మాత్రమే ఇస్తోంది. అంటే రోజుకు జిల్లా వ్యాప్తంగా 6.75 లక్షల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. శీతాకాలం, వానా కాలంలో సగటున ఆరు లీటర్ల వరకు పాల ఉత్పత్తి ఉంటుంది. వేసవి, కరువు ప్రభావం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతోంది. రోజుకు 10 లక్షల లీటర్ల పాలు అవసరం ఉండగా ప్రస్తుతం 6.75 లక్షల లీటర్లు మాత్రమే పాలు ఉత్పత్తి అవుతున్నాయంటే కొరత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. మార్చిలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో పాల ఉత్పత్తి ఏ స్థాయికి పడిపోతుందో ఉహించవచ్చు.
పాల పొడే శరణ్యం
పాల కొరతను ఎదుర్కొనేందుకు డెయిరీల్లో పాల పొడిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందువల్ల పాలకొరత కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో విజయ డెయిరీ కీలకమైనది. ఈ డెయిరీ రోజు 1.20 లక్షల లీటర్లు పాలు సరఫరా చేస్తోంది. పాల మార్కెటింగ్‌లో విజయ డెయిరీది 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంది. మరో 20శాతం మార్కెటింగ్ ఇతర ప్రయివేటు డెయిరీలది. మొత్తంగా 35 శాతం వరకు డెయిరీలు సరఫరా చేస్తుండగా మిగిలినæ 65 శాతం పాలు రైతులు సరఫరా చేస్తున్నారు. రైతుల పాల ఉత్పత్తి తగ్గడం వల్ల డెయిరీ పాలకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ప్రయివేటు డెయిరీలు అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
వసతులు కల్పించడంలో అధికారుల వైఫల్యం
గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా పశు సంవర్ధక శాఖ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో నీటితోట్లు ఏర్పాటు చేసి వాటిని ప్రతి రోజు నీటితో నింపాల్సి ఉన్నా 80శాతం గ్రామాల్లో నీటి తోట్లు లేవు. ఉన్న తొట్లలోను నీళ్లులేవు. వరుసగా కరువు వస్తోంది. ఇందువల్ల వేసవిలో నీటి తొట్లు అంటూ అధికారులు హడావుడి చేస్తున్నా కార్యరూపం దాల్చని పరిస్థితి. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమే. గత ఏడాది సైలేజిగడ్డి సబ్సిడీపై పంపిణీ చేసినా ఈ ఏడాది ఆ దిశగా కనీస చర్యలు కరువయ్యాయి. అజొల్లా, మొలకగడ్డి యూనిట్లును పాడి పరిశ్రమ నడిపే వారు వినియోగించుకుంటున్నా.. గ్రామీణ రైతులకు ధర అందుబాటులో లేకపోవడం గమనార్హం.
కాగితాలపైనే కొత్త పాడి పశువులు
కొత్త పాడి పశువులు కాగితాలపై కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ ఊసే కరువయింది. డీఆర్‌డీఏ–వెలుగులో సబ్సిడీపై రెండేళ్లుగా వేలాది పాడి పశువులు కొని స్వయం సహాయక సంఘల మహిళలకు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కనిపించట్లేదు. ఇతర జిల్లాల నుంచి గ్రేడెడ్ ముర్రా గేదెలను తెచ్చి పంపిణీ చేయాల్సి ఉన్నా.. స్థానికంగానే ఇతరుల పశువులు చూపి మమ అనిపించినట్లు విమర్శలు ఉన్నాయి. పశుసంవర్ధక శాఖలో గతంలో పశుక్రాంతి పథకం ఉండేది. దీని కింద రైతులకు మేలు జాతి పశువులు పంపిణీ చేసే వారు. వీటికీ ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రస్తుతం క్షీరసాగర్, సునందిని పథకాలు ఉన్నా.. అమలులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉన్న పశువులను కరువు కారణంగా అమ్మేస్తుండటంతో జిల్లాలో పాల ఉత్పత్తి పెరుగకపోగా.. తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement