క్షీరవిప్లవానికి నిర్లక్ష్యం దెబ్బ
Published Tue, Apr 4 2017 1:41 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
పెరవలి/భీమడోలు : రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో పాడి పశువులు సంఖ్య 18 లక్షలు. వీటిలో 12 లక్షల వరకు గేదెలు, 6 లక్షల వరకు ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 8 లక్షలకు పడిపోయింది. ఇందులో గేదెలు 6 లక్షలు కాగా, మరో 2 లక్షల ఆవులు మాత్రమే ఉన్నాయి. వీటిలోనూ పాలిచ్చే గేదెలు 4 లక్షలు, ఆవులు లక్ష వరకూ ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫలి తంగా పాల దిగుబడి గణనీ యంగా పడిపోయింది. దీంతో ప్రజలు ఇతర జిల్లాల నుంచి వచ్చే పాల ప్యాకెట్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. కీలకమైన సమయాల్లో పాల ఉత్పత్తి సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాయితీల ఎత్తివేతతో సమస్య
పాడి రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పశుక్రాంతి తదితర పథకాల ద్వారా రాయితీ ఇచ్చేవారు. హర్యానా నుంచి పశువులను కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు ఇచ్చేవారు. ఒక్కో పశువుకు 50 శాతంపైగా రాయితీ ఉండేది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా సమకూర్చేవారు. పశుక్రాంతి పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అటకెక్కిం చింది. ప్రస్తుతం కేవలం క్షీరసాగర పథ కం కింద చూడి పశువులకు మాత్రం దాణాను రాయితీపై ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఒక్కో లబ్ధిదారుడికి ఒక్కో పాడిపశువు చొప్పున ఇస్తున్నారు. ఒక్కో గేదె రూ.60 వేలు కాగా దీనిలో రూ.45 వేలు రాయితీకాగా మిగిలింది లబ్ధి దారుడు చెల్లించాలి. ఈ పథకం మం చిదే అయినా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో లేకుండాపోయింది. గతంలో డెయిరీ పెట్టే ఔత్సాహికులకు రాయితీలు ఉండేవి. ఇప్పుడు పూర్తిగా బ్యాంకులపై ఆధారపడాల్సిన దుస్థితి. ఈ పథకాలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ప్రైవేటుకు ప్రోత్సాహం : భీమడోలులోని విజయ డెయిరీ పాలనే జిల్లాలో చాలామంది వినియోగిస్తారు. గతంలో ఈ డెయిరీ పరిధిలో 200 పాల సేకరణ కేంద్రాలు ఉండేవి. ప్రభుత్వం ప్రైవేటు డెయిరీలను ప్రోత్సహిస్తూ.. సహకార రంగంలోని విజయ డెయిరీని నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డెయిరీకి 50 లీటర్ల పాలను శీతలీకరణ చేసే సామర్థ్యం ఉండగా.. ప్రస్తు తం 17 వేల లీటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో 23 వేల లీటర్ల వరకు పాలను సేకరించేవారు. ఇక్కడ ఉత్పత్తి పడిపోవడంతో ఇతర జిల్లాల పాలపై ఆధారపడాల్సి వస్తోంది. అవి నాణ్యంగా ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ సేకరించిన పాలను జిల్లాలో డెయిరీలకు ఇవ్వకుండా కృష్ణా, తూర్పుగోదావరిలోని ఇతర డెయిరీలకు పంపిస్తున్నారు. ఇక్కడి రైతులను ఆకట్టుకుని పాల సేకరణ లక్ష్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు.
కల్తీపాలతో అనారోగ్యం
జిల్లాలో పాల ఉత్పత్తి పడిపోవడంతో కల్తీ పాలు మార్కెట్‌లో స్వైరవిహారం చేస్తున్నాయి. మిల్క్ పౌడర్, సోయాబీన్ పౌడర్‌ను నీటిలో కలిపి పాటినే అసలైన పాలుగా విక్రయిస్తున్నారు. వీటి రంగు మెరుగుపరచడానికి డిటర్జెంట్లు కలుపుతున్నారు. వీటిని తాగిన వారు గ్యాస్ట్రిక్, కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్ని ఆహార కల్తీ నిరోధక శాఖ మిన్నకుండిపోతోంది.
ఆందోళన అవసరం లేదు
విజయ డెయిరీకి గతంలో పాలు సరఫరా చేసిన రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. విజయ పాలకు మంచి డిమాండ్ ఉంది. లక్ష్యాన్ని సాధించేందుకు కలెక్టర్ సారథ్యంలో ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసకుంటున్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘం ధర పెంచాలని కోరుతోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైతులు ప్రైవేటు డెయిరీలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ పాల డెయిరీని బలోపేతం చేసేందుకు సహకరించాలి. పాడి రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు.
– గుత్తా వెంకట శశాంక్‌ధర, ఏడీ, విజయ మిల్క్ డెయిరీ, భీమడోలు
Advertisement
Advertisement