తెలుగింటి మురిపాలు.. నేడు అంతర్జాతీయ క్షీర దినోత్సవం | International Dairy Day Special Article | Sakshi
Sakshi News home page

తెలుగింటి మురిపాలు.. నేడు అంతర్జాతీయ క్షీర దినోత్సవం

Published Wed, Jun 1 2022 1:32 AM | Last Updated on Wed, Jun 1 2022 1:32 AM

International Dairy Day Special Article - Sakshi

సూర్యుడు లేవడం డిలే అయినా పర్వాలేదు టైముకు పాలబ్బాయి పాల ప్యాకెట్‌ జార విడువకపోతే మన ఇల్లాళ్లకు తెల్లారదు. కాఫీ కొరకు ఒక అత్తగారు చాయ్‌ కోసం ఒక భర్తగారు పాల గ్లాసు కోసం బంగారుకొండలు అందరికీ సమాధానం చెప్పాల్సిందే. పాలు మనిషి ప్రాథమిక ఆహారం. సంస్కృతిలో భాగం. మొగుడూ పెళ్లాం పాలు నీళ్లలా కలిసిపోతేనే కాపురం. పాలుగారే పిల్లలతో మురిపాలు పోవడమే జీవితం. నేడు అంతర్జాతీయ క్షీర దినోత్సవం. అనుక్షణం జీవితంలో, జీవనంలో భాగమైన పాలకు పాలాభిషేకం చేసుకోవాల్సిన రోజు ఇది.

‘పాలు’ అనే మాటకు ఏకవాచకం లేదు. సదా బహువాచకమే. అందుకే ఇంట్లో చేరేప్పుడు పాలు పొంగిస్తారు. నలుగురూ కలిసి మెలిసి కళకళలాడాలని, ఆ తర్వాత ఆ పాలతో పాయసం చేస్తారు. తియ్యటి రోజులు ప్రాప్తించాలని. ప్రకృతి పాలకు తెల్లరంగు ఇచ్చింది. తెలుపు స్వచ్ఛతకు గుర్తు. అమ్మ పాలే కాదు ఏ పాలైనా స్వచ్ఛంగా ఉంటాయి. మన దేశంలో పాల వాడకం 6 వేల ఏళ్ల క్రితం నుంచి ఉందట.  సైంటిస్టులు బిగ్‌బ్యాంగ్‌ థియరీలు చెబుతారుగాని ఆఫ్రికన్లలో కొన్ని తెగలు ఈ విశ్వం ఒక క్షీర బిందువు నుంచి మొదలైందని విశ్వసిస్తాయి. ప్రాచీన గ్రీస్‌లో చాలా కాలం మామూలు ప్రజలకు పాలు తాగే వీలు లేదు. ఆ అర్హత రాచకుటుంబాలకు, పురోహితులకూ ఉండేది. ఇవాళ మన దేశంలో పాలు అందరికీ దొరుకుతున్నాయి. కాని ఒక మోస్తరు రాబడి ఉన్నవారే ‘నెయ్యి’ వాడతారు. అంటే మన దగ్గర కూడా మరో విధంగా పాలు అందరికీ అందుబాటులో లేనట్టే. పేదల ఇళ్లలోనే కాదు మధ్యతరగతి ఇళ్లల్లో కూడా నెయ్యి గిన్నె నేడు కానరావడం లేదు.

పాలు... మారుపాలు
తల్లికి పాలు పడకపోతే పూర్వం పాలుతాపే మారుతల్లులు ఉండేవారు. చిన్న కోడలో పెద్ద కోడలో బిడ్డకు చనుమొన అందించేది. అమెరికాలో దొరలు కన్న బిడ్డలకు ఆఫ్రికన్‌ బానిస స్త్రీల పాలు తాపే వారు. ఒక గర్భంలో పుట్టకపోయిన మరో వక్షం నుంచి పాలు తాగితే ఆ తల్లికీ ఈ తల్లికీ పుట్టిన పిల్లలు సహోదరులు అవుతారని ఒక సెంటిమెంట్‌. ఈ దశను దాటించేందుకు డబ్బాపాలు వచ్చాయి. ‘పిల్లాడికి పాలు అయిపోయాయి. డబ్బా తీసుకురండి’ అని చెప్పిన భార్యకు, తేవడం వీలవని భర్తకు భీకరమైన సంగ్రామాలు జరిగేవి. కూలినాలి చేసుకునే తండ్రి పాలడబ్బా నిండుకుంటూ ఉందంటే బెంగటిల్లిపోయేవాడు. అయితే మధ్యతరగతి ఇళ్లలో ఖాళీ అయిన పాలడబ్బాల్లో ఉప్పు, చింతపండు పెట్టుకునే ఆనవాయితీ ఉండేది. వంటగది అల్మారా తెలిస్తే బోసినవ్వుల పాపాయి బొమ్మ ఉన్న డబ్బాలే అన్నీ. విషాదం ఏమిటంటే పాడిపశువుల మన దేశం 1960 వరకూ విదేశాల నుంచి దాదాపు 55 వేల టన్నుల పాలపొడి దిగుమతి చేసుకునేది. లాల్‌బహదూర్‌ శాస్త్రి, కురియన్‌ల పుణ్యమా అంటూ ‘అమూల్‌’తో ‘క్షీర విప్లవం’ వచ్చాక ఇటు పాడి రైతు, అటు సగటు మనిషి పాలతో అవస్థపడే స్థితి పోయింది. అందుకే తన రోజుల్లో గాంధీ గారు మేక పాలను ప్రమోట్‌ చేశారు.

చల్లకొచ్చి ముంత దాస్తే
పాలు ఉంటే పాలబువ్వ ఉంటుంది. పెరుగన్నం ఉంటుంది. మంది పెరిగితే మజ్జిగ పలుచనవుతుంది. ఆ తర్వాత వెన్న పోగవుతుంది. మరగపెట్టుకుంటే నెయ్యి అవుతుంది. ఒకనాటి స్త్రీలకు ఈ పాల వ్యాపకాలన్నీ ఉండేవి. పాలు మరిగాక పైన ఎర్రగా కట్టే మీగడ కొందరు పిల్లలకు ఇష్టం. విరిగిన పాలతో చేసే జున్ను మరికొందరికి ఇష్టం. గడ్డపెరుగులో ఆవకాయ నంజుకోవడం అందరికీ ఇష్టం. మంచి ముద్దపప్పు, ఆపకుండా పోసే నెయ్యితో పెట్టే పెళ్లి భోజనం శ్రేష్ఠం. మారాం చేసే పిల్లల చేత పాలు తాగించడానికి కొందరు తల్లులు మహా మహా కథకులైపోయేవారు. హార్లిక్స్‌లు, బూస్ట్‌లు వారి క్రియేటివిటీని చావు దెబ్బ తీశాయి. ఇంతకు మునుపే కాఫీ, టీ తోటలు వచ్చి టీ, కాఫీలను అలవాటు చేసి వాటిని ఇంటి పానీయాలు చేశాయి. ‘టీ చేసి భర్తను నిద్రలేపే ఇల్లాలు’ అనే స్టీరియోటైప్‌ సిద్ధమైంది.ఇవాళ్టికీ టీ ప్రకటనల్లో టీ చేసేది ఇల్లాలే. రెండు టీలు పెట్టాలంటే ఎన్ని చెంచాల టీ పౌడర్‌ వేయాలో తెలియని మహానుభావులు నేటికీ నిండా ఉన్నారు. ఫ్రిజ్జులు రానంత కాలం ప్రతి ఇల్లాలికి పిల్లి బెడద ఉండేది. పాలకు విలన్‌ అదే. ‘పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు’ అని ఒక సామెత. ‘చల్లకొచ్చి ముంత దాచడం’ మరో సామెత.

అభిషేకాలు
భారతీయ పండగల్లో, పూజల్లో పాలు ముఖ్యం. ప్రసాదాల్లో విరివిగా వాడతారు. దధ్యోజనం, చక్కెర పొంగలి, పంచామృతం... పాలు లేకుండా సాధ్యం కాదు. పాలాభిషేకం చేయించడం ఒక ఆరాధన. సినిమా అభిమానులు కూడా తన హీరోల కటౌట్‌లకు పాలాభిషేకం చేయిస్తారు. ఇరవై ఏళ్ల క్రితం వినాయకుడి విగ్రహం పాలు తాగిన ‘వింత’ చాలామందికి గుర్తు. తాగడానికి గుక్కెడు పాలు లేని పిల్లలు కోట్లాది మంది. నేటికీ మన దేశంలో ఉంటే ఐశ్వరవంతులు కొందరు ‘పాలు తాగడం పాత ఫ్యాషన్‌’ అంటున్నారు. ‘అతి శాకాహారులు’ పాలు తాగడం పాపం అంటున్నారు. ఏమీ లేనప్పుడు ఒక గ్లాసు పాలు తాగి నిద్రపోయే మధ్యతరగతి మనుషుల గురించి వీరికి తెలియదు. పాల గురించి ఎవరు ఏమి చెప్పినా కల్తీ లేని పాలు ఉన్నంత కాలం మనిషి జీవంతో ఉంటాడు. జీవితాన్ని నిర్వహిస్తాడు. పాలు తాగుదాం. 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement