రాజమహేంద్రవరం : భూగర్భజలాల, మైన్స్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ రౌతు గొల్ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శుక్రవారం చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపిన వివారాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం జి. దొంతమూరుకు చెందిన తాళ్ళ చిరంజీవి రావు 7.50 ఎకరాల భూమికి గ్రావెల్ లీజు తీసుకునేందుకు మైన్స్ శాఖకు గత జూలైలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ క్రమంలో రంగంపేట తహసీల్దార్, కలెక్టర్ ఎన్‌ఓసీలు మంజూరు చేశారు. కాకినాడ గనులు, భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డెరైక్టర్ నుంచి అనుమతి ఇచ్చేందుకు ఆ శాఖ రాజమహేంద్రవరం ఏడీ రౌతు గొల్ల మాత్రం రైతు నుంచి ఎకరానికి రూ.15,000 చొప్పున మొత్తం రూ. లక్షన్నర లంచం అడిగారు. దీంతో చిరంజీవిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
డీఎస్పీ రామచంద్రరావు పథక రచన చేసి.... దాని ప్రకారం చిరంజీవిరావు ఏడీకి రూ.75 వేలు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారు. ఆ మొత్తాన్ని శుక్రవారం మైన్స్ శాఖ కార్యాలయంలో చిరంజీవి రావు నుంచి ఏడీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏడీపై గతంలో కూడా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయని డీఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు రౌతు గొల్లపై ఆరోపణలు ఉన్నాయని.. వాటిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఏడీ నివాసం ఉన్న విజయవాడ, రాజమహేంద్రవరంలతో పాటు సొంత ఊరు శ్రీకాకుళంలో కూడా సోదాలు జరుపుతున్నామని డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. స్థానిక సోమాలమ్మ గుడి సమీపంలోని ఏడీ ఇంట్లో సోదాలు చేయగా రూ.4 లక్షల నగదు లభించినట్టు తెలిసింది.