ఐయామ్ నాట్ జీరో..
-
మంత్రి నారాయణపై కయ్యానికి కాలు దువ్విన అజీజ్
-
ఇలాగైతే పార్టీ నాశనమవుతుందని మేయర్‌పై బీద ఆగ్రహం
-
మేయర్‌పై టీడీపీ నేతల మూకుమ్మడి ఫిర్యాదు
నెల్లూరు సిటీ: ఐయామ్ నాట్ జీరో.. ఐయామ్ అజీజ్.. మంత్రి పని మంత్రి చేయాలి.. మేయర్ పని మేయర్ చేస్తారు అంటూ మేయర్ అబ్దుల్ అజీజ్ మంత్రి నారాయణపై కయ్యానికి కాలుదువ్వడంతో టీడీపీ ముఖ్యనేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి నారాయణ క్యాంప్ ఆఫీస్‌లో ఆదివారం కార్పొరేషన్ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో మేయర్ తీరుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మేయర్‌పై అసహనం వ్యక్తం చేశారు. దీంతో మేయర్ అదే స్థాయిలో మంత్రిపై ఎదురుదాడికి దిగారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ మధ్య విభేదాలు ఇప్పటి వరకు తెరవెనుకనే జరిగాయి. మేయర్ వ్యవహార తీరులో రోజురోజుకూ మార్పులు రావడం, వ్యవహారశైలి మారడంతో మంత్రి నారాయణకు ఆగ్రహం తెప్పించింది. దీంతో మేయర్‌కు పార్టీ సమావేశంలోనే మంత్రి అక్షింతలు వేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సమావేశానికి టీడీపీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పార్టీ ఫ్లోర్‌లీడర్ శివప్రసాద్, ఇతర నేతలు హాజరయ్యారు. సమావేశానికి మేయర్ అజీజ్ రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చారు. నేతలు పలుమార్లు ఫోన్ చేస్తే గానీ సమావేశానికి రాలేదని సమాచారం. శనివారం మంత్రి నారాయణ నగరంలో ఉన్నా మేయర్ అజీజ్ ఆయన్ను కలవకపోవడం గమనార్హం.
ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి టీడీపీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, జెడ్ శివప్రసాద్, కార్పొరేటర్లతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని మంత్రి నారాయణ మేయర్‌కు సూచించారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు. మేయర్‌ను ఉద్దేశించి 'నువ్వు చేస్తున్న పని తీరు బాగాలేదని, నువ్వు జీరోవి అంటూ మంత్రి మండిపడినట్లు తెలుస్తోంది. మేయర్ ద్వారా పార్టీ నిలబడదని, ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. నీ ఒక్కడి కారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయని, దీని వల్ల రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిధుల మంజూరు ప్రకటనలకే పరిమితం
మంత్రి నారాయణ వ్యాఖ్యలకు మేయర్ ఘాటుగా స్పందించారు. కార్పొరేషన్ అభివృద్ధికి రూ.కోట్ల నిధులిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని, ఆచరణలోకి వచ్చే సరికి ఒక్క రూపాయి రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల మంజూరు ప్రకటనలకే పరిమితమైందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఇన్‌చార్జీలు, కార్పొరేటర్లే తనను సంప్రదించాలని, తాను వాళ్ల వద్దకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎవరికైనా పనులు కావాలంటే తనతో చెప్తేనే కదా కేటాయించేదన్నారు.
ఇలాగైతే పార్టీ నాశనం
మేయర్ అజీజ్ వ్యవహారంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మండిపడ్డారు. ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే పార్టీ నాశనమవుతుందన్నారు. మరోవైపు మేయర్ వ్యవహారంపై నగరపాలక టీడీపీ నేతలు, కార్పొరేటర్లు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు అజీజ్‌లో మార్పు వస్తుందని చూసిన నేతలు తాజాగా ఆయన మంత్రిపైనే తిరుగుబాటు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.