
అధికారంలో ఉన్నామో... లేమో....!
బీజేపీ కార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదు: మంత్రి మాణిక్యాలరావు
సాక్షి, చిత్తూరు: అధికారంలో ఉన్నా బీజేపీ కార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం ఉదయం చిత్తూరుకు వచ్చిన మంత్రి స్థానిక బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు తమను ఖాతరు చేయడం లేదని, తాము ఏమి చెప్పినా పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి ముందు వాపోయారు.
అందుకు స్పందించిన మంత్రి రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితే ఉందని, బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నామో.. లేమో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం సంధికాలంలో ఉన్నామని.. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు పలుకుతోందని విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.