మంత్రి హామీని అమలు చేయాలి
కర్నూలు సిటీ: క్వింటాల్ ఉల్లిని రూ. 700 ప్రకారం కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ కూమార్ డిమాండ్ చేశారు. స్థానిక కార్మిక, కర్షక భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు ఉల్లికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. ఉల్లికి కొనుగోళ్లకు సంబంధించి దేశంలో రెండో పెద్దమార్కెట్‌గా పేరున్న కర్నూలు యార్డులో వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన ఉండాల్సిన మార్కెట్ యార్డు పాలక వర్గం వ్యాపారులకు వంత పాడుతున్నారని ఆరోపించారు. పొలం నుంచి ఒక సంచి ఉల్లిని తీసుకవచ్చేందుకు రూ. 80 నుంచి రూ.120 ఖర్చు అవుతుందని, తీరా ఇక్కడికొచ్చాక రూ. 100కు మించి ధర రాకపోతే రైతు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేసినప్పుడు ఆదుకుంటామని చెబుతూ ప్రభుత్వం మభ్యపెడుతోందని విమర్శించారు. గతేడాది ఇదే సమయానికి క్వింటా ధర రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు పలికిందని, ఇప్పుడు ధర పడిపోవడానికి కారణాలేవో అర్థం కావడం లేదన్నారు. కనీస మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం నాయకులు సోమన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.