మైనార్టీలు నమ్మటం లేదు!
– సీఎంకు నేరుగా తేల్చిచెప్పిన పలువురు నేతలు
– అందుకే బెదిరింపులకు దిగిన సీఎం చంద్రబాబు
– మునిసిపల్ చైర్‌పర్సన్‌ను దించే అవకాశం లేదంటున్న నిపుణులు
– నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టే వీలులేదంటున్న చట్టాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉపఎన్నికల వేడి అధికార పార్టీ అధినేతకు నేరుగా తాకింది. మైనార్టీలు పార్టీని నమ్మడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నంద్యాలకు చెందిన పలువురు నేతలు తేల్చిచెప్పారు. మైనార్టీలకు నిర్దిష్టంగా ఏదైనా లబ్ధి చేస్తే కనీసం వారికి చెప్పుకునే వీలు ఉంటుందని ఈ సందర్భంగా సీఎంకు స్పష్టం చేసినట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనలో భాగంగా నంద్యాలలో సీఎం చంద్రబాబు.. పార్టీ నేతలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్పొరేటర్లు తమ భావాలను నిర్దిష్టంగా తేల్చిచెప్పారు. మైనార్టీలకు ఇది చేశామని చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని కుండబద్దలు కొట్టారు.
ఇప్పటికైనా వారి సంక్షేమం కోసం ఏమైనా చేస్తేనే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మరుసటి రోజు తమకు ఓట్లు వేయాల్సిందేనని సీఎం బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. తాను ఇచ్చే పింఛన్లను తీసుకుని, తాను వేసిన రోడ్లపై నడిచి ఎందుకు ఓట్లు వేయరని ఎదురు ప్రశ్న వేశారు. పార్టీ పరిస్థితిని గమనించే సీఎం ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఓట్లు వేయకుంటే అభివృద్ధి చేయబోమంటూ బెదిరింపులకు దిగడం ద్వారా లబ్ధి పొందాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి..పార్టీ మారడంతో నంద్యాల మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో మునిసిపల్ చైర్ పర్సన్‌ను దించాలనే నాటకానికి కూడా తెరదీశారు.
చట్టం కుదరదంటోంది..!
వాస్తవానికి స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన తర్వాత జెడ్పీ చైర్మన్‌ను కానీ, ఎంపీపీని కానీ, మునిసిపల్ చైర్మన్‌ను కానీ దించాలంటే గతంలో రెండేళ్ల కాల పరిమితి ఉండేది. రెండేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి దించే వెసులుబాటు ఉండేది. అయితే, ఇది పరిపాలనకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ సమయాన్ని నాలుగేళ్లకు పెంచారు. అంటే నాలుగేళ్ల వరకూ స్థానిక సంస్థల్లో అంటే జెడ్పీ చైర్మన్‌ను కానీ మునిసిపల్ చైర్మన్‌ను కానీ ఈ సమయంలోగా దించే అవకాశం లేదన్నమాట. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చట్టంలోని సవరణలు కూడా 2008లో చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 91–ఏ ప్రకారం పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ల తర్వాత సగం కంటే ఎక్కువ మంది సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
ఈ మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీహెచ్‌ఎంసీ చట్టం–1995లో యాక్ట్ ఆఫ్ 42 ఆఫ్ 2008 ప్రకారం సవరణలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానంలో సస్పెండైన సభ్యులు కూడా ఓటింగులో పాల్గొనే వీలుంటుందని జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని 91–ఏ సెక్షన్ స్పష్టం చేస్తోంది. అయితే, చట్టాలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ అధికార తెలుగుదేశం నేతలు మాత్రం కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగుతున్నారు. 24 గంటల్లో పార్టీలోకి రాకపోతే సస్పెన్షన్ వేటు వేసి చైర్‌పర్సన్‌ను దించేస్తామనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల వేడి అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అర్థమవుతోంది.