సాక్షి ప్రతినిధి, కడప: గండికోట ముంపువాసులు దశాబ్దాల తరబడి పరిహారం ప్యాకేజీ కోసం నీరీక్షిస్తున్నారు. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలో అధికారపార్టీ నాయకులంతా చర్చించి ముంపువాసులకు ప్యాకేజీ నిర్ణయించారు. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు రావడమే తరువాయి అనుకున్న తరుణంలో పీటముడి పడింది. చర్చల్లో ఆర్భాటంగా వ్యవహారించిన టీడీపీ నాయకులు ముఖం చాటేశారు. నిర్వాసితులకు పెద్దదిక్కులాంటి కలెక్టర్ చేతులెత్తేయంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. పునరావాసం ఫ్యాకేజీ కోసం గండికోట ముంపువాసులు పోరాటం చేశారు. ఎట్టకేలకు గత అక్టోబర్ 8న కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. 2016 సెప్టెంబర్ 30 కటాఫ్‌డేట్‌గా పరిగణించి, అర్హులందరీకీ ప్యాకేజీ సొమ్ము చెల్లిస్తామని స్పష్టం చేశారు. తర్వాతే గండికోటలో నీరు నిల్వ చేస్తామని చెప్పడంతో ముంపువాసులు ఆనందపడ్డారు. స్వయంగా కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారికి భరోసా దక్కినట్లైంది. రెండు నెలలు గడిచిపోయాక సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్యాకేజీ ఇవ్వకుండానే నీరు నింపే చర్యలకు ప్రభుత్వ పెద్దలు సన్నద్ధమయ్యారు. మరోరెండు రోజుల్లో ముంపుగ్రామమైన చౌటపల్లెలోకి గండికోట నీళ్లు రానున్నాయి.
5 టీఎంసీలు నిల్వచేసేందుకు సన్నద్ధం
గండికోట రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వచేయాలనే లక్ష్యంతో పాలకులున్నారు. నీరు నిల్వ చేయడం జిల్లాకు అవసరమే అయినప్పటికీ త్యాగధనులైనా ముంపువాసులకు ప్యాకేజీ ఇవ్వకుండానే నట్టేట ముంచాలనుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నిర్ణయం అయిపోయాక తమను మానసిక క్షోభకు గురిచేయడం ఏ మేరకు సమంజసమని చౌటపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా 5 టీఎంసీలు నీరు నిల్వ చేసి పైడిపాళెం ప్రాజెక్టు లిఫ్ట్ చేయాలనే తలంపుతో ఉన్న యంత్రాంగం, అదే దృక్పథం ముంపువాసుల పట్ల కూడా ఉండాలి కదా! అని హక్కుల నేతలు నిలదీస్తున్నారు. పైడిపాళెంకు నీళ్లు లిఫ్ట్‌చేసి టీడీపీ నేత ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి గడ్డం గీయించాలనే ఆలోచన ఉన్నప్పుడు ముంపువాసులకు పునరావసం ప్యాకేజీ ఇవ్వడంలో తాత్సారం చేయడం ఎందుకనీ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ముంపులో ముంచిన ఆ ఇద్దరు!
మాజీమంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముంపువాసులను నట్టేట ముంచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సమావేశం నిర్వహించి తామే పరిహారం ప్యాకేజీలు ఇప్పించామని చెప్పుకునేందుకు మొత్తం టీడీపీ నాయకులంతా ఆశీనులయ్యారు. కలెక్టర్ చెంతన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డిలు ముంపు గ్రామాల ప్రజలతో చర్చలు నిర్వహించారు. ప్యాకేజీకి ఒప్పించారు. ఎట్టకేలకు న్యాయం లభించిందని భావించగా రెండు నెలలు ఆ ఊసే ఎత్తకుండా ప్యాకేజీ విషయం ఆలోచించకుండా నీరు నిల్వ చేయడం ఆరంభించారు. తమ పరిస్థితి ఏమిటని ముంపువాసులు ప్రశ్నిస్తే ఎవ్వరికి వారు చేతులెత్తేస్తున్నారు. అండగా ఉండాల్సిన జమ్మలమడుగు నేతలు ముఖం చాటేశారు. కలెక్టర్ సైతం రాజకీయ నాయకుల వలే మాటలు చెప్పడం ఆరంభించారు. ప్యాకేజీ ఇచ్చేంత వరకూ నీరు నిల్వ చేయమని స్వయంగా కలెక్టర్ హామీ ఇచ్చి తాజాగా తానేమీ చేయలేనని చేతులెత్తేయడాన్ని నిర్వాసితులు తప్పుబడుతున్నారు. 2016 సెప్టెంబర్ 30 కట్‌ఆఫ్‌డేట్ ప్రకారం అదనంగా 3,325 యూనిట్లకు ప్యాకేజీ వర్తిస్తుంది. వారందరికీ తక్షణమే నగదు చెల్లించకపోయిన కనీసం ప్రభుత్వ ఉత్తర్వులైనా జారీ చేయాలి కదా... అని పలువురు నిలదీస్తున్నారు. అవేవి పట్టించుకోకుండా మీచావు మీరు చావండి...అన్నట్లుగా ఆ ఇద్దరు నాయకులు ఉండిపోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మి వెంట నడిచిన నేరానికి ఆ ఇద్దరు నిర్వాసితులను నట్టేట ముంచుతున్నారని ముంపువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నట్టేట ముంచారు!
Published Tue, Dec 13 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
Advertisement
Advertisement