స్పష్టం చేసిన ఎమ్మెల్సీ ... వెనుతిరిగిన మంత్రి
అనంతపురం: ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతులపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని ఎమ్మెల్సీ గేయానంద్ స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయన దీక్షకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయనకు సంఘీభావంగా ఆయా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. అయితే దీక్ష చేస్తున్న గేయానంద్ను కలిసేందుకు వచ్చిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి.
ఆ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో గేయానంద్ను మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫోనులో మాట్లాడించారు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని గేయానంద్ మంత్రి కామినేనితో స్పష్టం చేశారు. దీంతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెనుదిగిరి వెళ్లిపోయారు.
అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... స్పందించకపోవడంతో ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఆసుపత్రి ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.