geyanand
-
‘పీజీ సీట్ల కోసం ఉద్యమం’
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పీజీ సీట్ల కోసం ప్రజా ఉద్యమం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ స్పష్టం చేశారు. పీజీ సీట్లు మంజూరు చేయాలంటూ మంగళవారం సర్వజనాస్పత్రి ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అభివృద్ధి బాటలో పయనిస్తుంటే ఇక్కడి కళాశాల పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉందన్నారు. సాక్షాత్తూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లా ఇ¯ŒSచార్్జగా ఉన్నా ఏనాడూ కళాశాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. కళాశాలలోని అన్ని విభాగాల్లో పీజీ సీట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 8వ రోజుకు చేరిన దీక్షలు మెడికల్ కళాశాలకు పీజీ సీట్లు, వైద్యుల సమస్యల పరిష్కారం కోసం సర్వజనాస్పత్రిలో వైద్యులు చేస్తున్న రిలే దీక్షలు మంగళవారం 8వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్లు పూజారి శ్రీనివాస్, కిశోర్, రాజశేఖర్లు దీక్షలో కూర్చున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ వీరభద్రయ్య తెలిపారు. -
‘ప్రజా తీర్పును స్వీకరిస్తా’
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాతీర్పును బాధ్యతగా స్వీకరిస్తానని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్నో ప్రలోభాలు, ఒత్తిళ్లను అధిగమించి తనకు ఓటు వేసిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎంతో అంకిత భావంతో పనిచేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. -
పీడీఎఫ్ అభ్యర్థిగా గేయానంద్
అనంతపురం ఎడ్యుకేషన్ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థిగా ఎమ్మెల్సీ గేయానంద్ బరిలో దిగనున్నారు. ఈ మేరకు స్థానిక కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించే సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించనున్నారు. -
ఎమ్మెల్సీ గేయానంద్ దీక్ష భగ్నం
అనంతపురం : ఎమ్మెల్సీ గేయానంద్ దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు గేయానంద్ నిరాకరించారు. ఖాళీగా ఉన్న 510 వైద్య పోస్టులతోపాటు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ... గేయానంద్ దీక్షకు దిగన విషయం విదితమే. -
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ ... వెనుతిరిగిన మంత్రి
అనంతపురం: ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతులపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని ఎమ్మెల్సీ గేయానంద్ స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయన దీక్షకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయనకు సంఘీభావంగా ఆయా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. అయితే దీక్ష చేస్తున్న గేయానంద్ను కలిసేందుకు వచ్చిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. ఆ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో గేయానంద్ను మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫోనులో మాట్లాడించారు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని గేయానంద్ మంత్రి కామినేనితో స్పష్టం చేశారు. దీంతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెనుదిగిరి వెళ్లిపోయారు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... స్పందించకపోవడంతో ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఆసుపత్రి ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
విద్యారంగం బలోపేతానికి కమిషన్ ఏర్పాటు చేయాలి
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ గేయానంద్ కోరారు. అదేవిధంగా ప్రతి మోడల్ పాఠశాలకు కోటి రుపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని డీసీఈబీ హాలులో శనివారం ఆంద్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బీరం సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నేటికీ చాలా పాఠశాలల్లో తగినన్ని మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మంచినీటికి ట్యాం కులు సరిగాలేవన్నారు. తొలగించిన కంప్యూటర్ ఉపాధ్యాయులను మళ్లీ తీసుకోవాలని కోరారు. భాషాపండితుల అప్గ్రేడేషన్, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించామన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు ఆమోదింప జేయడానికి కృషి చేశామన్నారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరెడ్డి మాట్లాడుతూ డైట్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టుల ప్రమోషన్లకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటి డీఈఓ, ఎంఈఓల పోస్టులను భర్తీ చేయక పోవటంవల్ల పర్యవేక్షణ కొరవడిందన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజా మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై జిల్లా విద్యాశాకా కార్యాలయం వద్ద ఈనెలలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
డ్వాక్రా మహిళలను మోసగించిన బాబు
ఒంగోలు టౌన్ : తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు రద్దు చేస్తూ సంతకం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ తరువాత దాని ఊసే ఎత్తకుండా మోసగించారని రాయలసీమ ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. ఐద్వా జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవన్లో సోమవారం మోసగించిన బాబు నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెలరోజులు దాటినప్పటికీ డ్వాక్రా రుణాల రద్దు గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు. అవి ఎప్పుడు రద్దు చేస్తారా అని మహిళలు ఎదురు చూస్తుంటే, వారిని తప్పించుకునే ప్రయత్నం బాబు చేస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలు తక్కువ మొత్తంలోనే ఉన్నాయన్నారు. త్వరలో జరగనున్న మండలి సమావేశాల్లో డ్వాక్రా రుణాల రద్దు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కారుసాల సుబ్బరావమ్మ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో ఎక్కువ మంది మహిళలు నమ్మి చంద్రబాబును గెలిపిస్తే చివరకు మోసగించారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డ్వాక్రా రుణాలు రద్దుచేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్కే మున్వర్ సుల్తానా మాట్లాడుతూ పొదుపు డబ్బులను సభ్యులకు తెలియకుండా రుణాలకు జమ చేయరాదని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యూ ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో నాయకురాళ్లు జే అన్నపూర్ణ, కే రమాదేవి, కే సృజన, కే రాజేశ్వరి పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఐద్వా నాయకురాళ్లు, కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి కలెక్టర్ విజయకుమార్కు వినతిపత్రం సమర్పించారు.