‘నయీమ్’ ఎఫ్‌ఐఆర్‌లో మండలి డిప్యూటీ చైర్మన్
నేతి విద్యాసాగర్ పేరు ప్రస్తావన
► నయీమ్ బారినుంచి కాపాడాలంటూ నేతి దగ్గరికెళ్లా.. నయీమ్‌తోనే నేరుగా మాట్లాడుకొమ్మన్నాడు
► తర్వాత తనే ఫోన్ చేశాడు.. నయీమ్ ఫోన్ చేస్తాడని చెప్పాడు
► భువనగిరి పీఎస్‌లో వ్యాపారి నాగేందర్ ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్ నమోదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు, ప్రజాప్రతినిధుల్లో కొందరు నయీమ్‌కు సహకరించారని ఇప్పటివరకు ఆరోపణలు పరోక్షంగా రాగా, తొలిసారి ఓ ప్రజాప్రతినిధి పేరును ఈ కేసులో పోలీసులే ప్రస్తావించడం రాజకీయ సంచలనానికి దారితీసింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పేరును నయీమ్ కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్)లో పోలీసులు ప్రస్తావించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారి, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ (57) ఈ నెల 17న ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి టౌన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (నంబర్ 234/2016)లో నేతి పేరు ప్రస్తావించారు.
‘‘నయీమ్ నుంచి నాకు బెదిరింపులు రావడంతో, కాపాడాలంటూ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ను కలిశా. నేరుగా నయీమ్‌ను కలిసి మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. తర్వాత కొన్ని రోజులకు మా పొరుగుంటికి విద్యాసాగర్ ఫోన్ చేశారు. నా సెల్ స్విచాఫ్ వస్తోందని, వెంటనే నాతో కాల్ చేయించాలని వారికి చెప్పారు. దాంతో నేను నా మొబైల్ నుంచి విద్యాసాగర్‌కు ఫోన్ చేశాను. ‘ఫోన్ స్విచాన్ చేసి పెట్టుకో. నయీమ్ ఫోన్ చేస్తాడు’ అని ఆయన నాకు చెప్పారు’’ అంటూ నాగేందర్ లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చినట్టు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇలా మూడు నాలుగుసార్లు విద్యాసాగర్ పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం.
ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే...
భువనగిరిలో శివ పార్‌బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ పేరిట నాగేందర్ రైస్ మిల్లు వ్యాపారం చేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు మంచాల ఆటో సర్వీస్ పేరుతో భువనగిరిలోనే పెట్రోల్ బంక్ నడుపుతున్నారు. నయీమ్‌ను కలవాలంటూ అతని అనుచరులుగా చెప్పుకునే పాశం శ్రీనివాస్, మరో వ్యక్తి నాగేందర్ ఆఫీసు మేనేజర్ కృష్ణకు మార్చి 8న సమాచారమిచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మార్చి 17న నాగేందర్‌కు పాశం 9866144889 నంబర్ నుంచి కాల్ చేశాడు. ‘మర్నాడు నయీమ్ భాయ్‌ని కలవాలి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటా’యని బెదిరించాడు. నయీమ్‌కు తెలిసిన వ్యక్తి అయిన నేతి విద్యాసాగర్ (ఎమ్మెల్సీ) తనను రక్షించగలడని మార్చి 17న ఆయనను హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో నాగేందర్ కలిశాడు.
నయీమ్, అతని అనుచరుల నుంచి రక్షించాలని కోరాడు. నయీమ్‌నే నేరుగా కలిసి మాట్లాడుకొమ్మని విద్యాసాగర్ సూచించారు. మార్చి 18న పాశం, మరో ఇద్దరు కలిసి నాగేందర్‌ను భువనగిరి రేణుకా ఎల్లమ్మ గుడి నుంచి డస్టర్ కారులో కళ్లకు గుడ్డలు కట్టి ఘట్‌కేసర్, ఔటర్‌రింగురోడ్డు దాటించి తీసుకెళ్లారు. తర్వాత నలుపు ఎక్స్‌యూవీ 500 కారులోకి మార్చి చివరికి నయీమ్ వద్దకు తీసుకెళ్లారు. నయీమ్ ముగ్గురు 20 ఏళ్ల సాయుధ యువతులతో కలిసి ఉన్నాడు. తనకు రూ.5 కోట్లు తనకు ఇవ్వాలన్నాడు. లేదంటే నాగేందర్‌ను, అతని కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. చివరికి రూ.కోటి ఇచ్చేందుకు నాగేందర్ అంగీకరించాడు. ఏప్రిల్ 30లోపు డబ్బులివ్వాలని, లేదంటే నాగేందర్ కొడుకుల్లో ఒకరిని చంపేస్తానని, తర్వాత మిగతా వాళ్లనూ అంతం చేస్తానని నయీమ్ హెచ్చరించాడు.
‘‘మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడిని చంపినట్టుగానే నీ కొడుకునూ హత్య చేస్తా. రోడ్డు ప్రమాదంగా చిత్రిస్తా, ఎవరూ పసిగట్టలేరు కూడా’’ అని నాగేందర్‌ను బెదిరించాడు. తర్వాత నాగేందర్‌ను గంతలు కట్టి తీసుకెళ్లి భువనగిరి రేణుకా ఎల్లమ్మ గుడి దగ్గర దింపేశారు. తర్వాత ఏప్రిల్ 30న నాగేందర్ పక్కింటి వ్యక్తికి ఎమ్మెల్సీ విద్యాసాగర్ ఫోన్ చేశారు. నాగేందర్ ఫోన్ స్విచాఫ్ వస్తోందని అతనికి చెప్పాడు. వెంటనే నాగేందర్‌తో తనకు ఫోన్ చేయించాలన్నాడు. దాంతో నాగేందర్ తన మొబైల్ నుంచి విద్యాసాగర్‌కు ఫోన్ చేశాడు. ‘నయీమ్ ఫోన్ చేస్తాడు, ఫోన్ ఆన్‌లోనే ఉంచుకో’ అని నాగేందర్‌కు విద్యాసాగర్ చెప్పాడు. ఉదయం 8:30 ప్రాంతంలో నాగేందర్‌కు నయీమ్ ఫోన్ చేశాడు. వెంటనే డబ్బు చెల్లించాలని బెదిరించాడు. తన అనుచరులు పాశం, సుధాకర్‌ల మీద నాగేందరే పీడీ యాక్టు పెట్టించాడని అనుమానించాడు.
(ఇదంతా నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదులో ఉందని మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించారు)