జిల్లాలో ఓ మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వలన జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజుపాలెంలో 35.6 మి.మీ, చాపాడులో 31.6 మి.మీ, దువ్వూరులో 10.2 మి.మీ, మైదుకూరులో 5.8 మి.మీ, ప్రొద్దుటూరులో 5.8 మి.మీ, కొండాపురంలో 3.2 మి.మీ, ముద్దనూరు 3.2 మి.మీ, జమ్మలమడుగు 4.4 మి. మీ, మైలవరం 2.4, సిద్ధవటం 1.4, కమలాపురం 3.2, ఖాజీపేట 2.2 మి.మీ, చెన్నూరు 8.2 మి.మీ, కడప 1.2 మి. మీ వర్షం కురిసింది.
రెండు మండలాల్లో పంట నష్టం
జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకు డి ఠాకూర్ నాయక్ తెలిపారు. సింహాద్రిపురం మండలంలో పత్తి 80 ఎకరాల్లోను, వేరుశనగ పంట 10 ఎకరాల్లోను, మినుము పంట 10 ఎకరాల్లోను దెబ్బతిన్నట్లు తెలిపారు. అలాగే దువ్వూరు మండలంలో వరి పంట 340 ఎకరాల్లోను, వేరుశనగ పంట 125 ఎకరాల్లోను, కంది పంట 100 ఎకరాల్లోను, మినుము పంట 50 ఎకరాల్లోను దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు.