హడలెత్తిస్తున్న ఫోన్ కాల్
తాడిపత్రి టౌన్:
అగంతకుడు: ‘హలో.. నేను బ్యాంక్ మేనేజర్‌ని మాట్లాడుతున్నా. మీ ఏటీఎం కార్డు బ్లాక్ చేస్తున్నాం’
ఖాతాదారుడు: అయ్యో సార్.. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు?
అగంతకుడు: అయితే మీ కార్డు సీక్రెట్ నంబర్ సహా, కార్డు నంబర్ కూడా చెప్పండి.
ఖాతాదారుడు: కార్డు నంబర్, సీక్రెట్ నంబర్ చెప్పారు.
ఆ తరువాత ఏం జరిగింది: ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి.
అరె.. డబ్బులే డ్రా చేయలేదు. ఎలా మాయమయ్యాయ్ అంటూ ఖాతాదారుల ఆందోళన.
ఇలా ప్రతి రోజూ ఎవరికో ఒకరి సెల్‌ఫోన్‌కు 7354943632 నంబర్ నుంచి కాల్ రావడం, వారు భయపడి తమ వివరాలు తెలపగానే డబ్బులు మాయం కావడం వరుసగా జరుగుతున్నాయి. తాడిపత్రిలో ఆర్టీసీ కార్మికులు చాలా మంది ఇలా వేలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ విషయం కార్మికులందరికీ తెలసిపోవడంతో బాధితులందరూ ఆదివారం డిపో వద్ద ఒక్కటై తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువుపెట్టుకున్నారు.
తాడిపత్రి ఆర్టీసీ డిపో పరిధిలో 547 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మోకానిక్‌లు ఉన్నారు. వారం రోజులుగా 7354943632 నంబర్ నుంచి పలువురు కార్మికులకు వరుసగా కాల్స్ వచ్చాయి. తాను ఎస్‌బీహెచ్ బ్యాంకు మేనేజర్‌నంటూ అగంతకుడు హిందీలో ఖాతాదారులను భయపెట్టి వారి వివరాలు రాబట్టుకోవడం, ఆ తరువాత వారి ఖాతాలో డబ్బు డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో కంగుతిన్నారు. ఇలా గ్యారేజీ మెకానిక్ గౌస్‌మోహిద్దిన్ ఖాతాలో రూ.13 వేలు డ్రా కాగా, పెయింటర్ రమేశ్ ఖాతాలో రూ.800, మరో మెకానిక్ రుద్రముని ఖాతాలో రూ.6 వేలు, డైవర్ లక్షుమయ్య ఖాతా నుంచి రూ.7 వేలు, కండక్టర్ ఎస్‌పీ రావు ఖాతా నుంచి రూ.35 వేలు మాయమయ్యాయి. ఇంకా ఏడీసీ హమీద్ ఖాతాలో రూ.3 వేలు డ్రా అయ్యాయి.
ఫోన్ నంబర్ గురించి ఆరా తీస్తే బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చినట్లు వెల్లడైందని గుర్తించారు. తమకు జరిగిన అన్యాయం గురించి కార్మికులు డీఎం నరేంద్రరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.