బాలికను పోలీసులకు అప్పగించిన చిలకలూరిపేట యువకులు, ఐసీడీఎస్ అధికారి నాగమణికి బాలిక రతిక అప్పగించిన సీఐ (ఇన్ సెట్)
- చీరాల పోలీసుల చెంతకు చేరినహైదరాబాద్ బాలిక
- బాలికను విక్రయించి వదిలించుకున్న తల్లి
- చెర నుంచి తప్పించుకున్న బాలికను క్షేమంగా పోలీసులకు
- అప్పగించిన చిలకలూరిపేట యువకులు
చీరాల రూరల్: మరో పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందని కన్నకూతురినే విక్రయించేసింది ఓ తల్లి. కొన్న వారి చెంత నానా కష్టాలు అనుభవించిన పదకొండేళ్ల బాలిక వారిచెర నుంచి తప్పించుకుని చిలకలూరిపేట యువకుల కంటపడింది. వారి ద్వారా క్షేమంగా చీరాల పోలీసుల చెంతకు చేరింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది.
బాలిక రతిక, ఒన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు... హైదరాబాద్‌కు చెందిన రాజు, పూజ భార్యాభర్తలు వారి కాపురంలో కలతలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె వేరే వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు కుమార్తె రతిక (11) అడ్డుగా ఉందని భావించిన ఆమె మూడు నెలల క్రితం విజయవాడలో తెలిసిన వారికి అమ్మేసింది. వారు అక్కడ నుంచి రితికను చీరాలలోని జాండ్రపేటకు చెందిన వేరొకరివద్దకు పంపించారు. జాండ్రపేటలో బాలికతో నానా చాకిరీ చేయిస్తూ ఇబ్బందులు పెట్టారు. భరించలేని బాలిక సోమవారం అక్కడి నుంచి తప్పించుకొని బయటపడింది.
ఆటోలో ఎక్కి కారంచేడులో దిగింది. ఒంటరిగా దిగాలుగా నడుచుకుంటూ వెళుతున్న బాలిక గ్రామంలో మంచాలు విక్రయిస్తున్న చిలకలూరిపేటకు చెందిన అబ్దుల్‌బాషా అనే యువకుడి కంట పడింది. ఆ బాలిక నుంచి వివరాలు సేకరించిన బాషా ఆమెను తన స్వగ్రామమై చిలకలూరిపేట తీసుకెళ్లి తన స్నేహితుల సహాయంతో చిలకలూరిపేట పోలీసులకు అప్పగించాడు. చిలకలూరిపేట పోలీసులు ఆ బాలిక చీరాల పరిధిలో నుంచి వచ్చింది కనుక అక్కడికే తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో యువకులు వారి పనులుమానుకొని ఆ బాలికను మంగళవారం చీరాల వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. స్పందించిన సీఐ సత్యనారాయణ ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవో నాగమణికి సమాచారం అందించి స్టేషన్‌కు పిలిపించారు. బాలికను ఒంగోలులోని ప్రభుత్వ హోమ్‌కు తరలించాలని సూచించి వారికి అప్పగించారు. ఎంతో బాధ్యతగా వ్యవహరించి బాలికను క్షేమంగా పోలీసుస్టేషన్‌లో అప్పగించిన చిలకలూరిపేట యువకులను సీఐ అభినందించారు.