ఎంఏడీఏలో కదలిక
మచిలీపట్నం : మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (ఎంఏడీఏ) ద్వారా భూసమీకరణలో కదలిక వచ్చింది. కలెక్టర్ బాబు.ఎ సోమవారం డీఆర్వో చెరుకూరి రంగయ్య, ఆర్డీవో పి సాయిబాబు, డెప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో తన చాంబర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ కోసం ఎంఏడీఏ పరిధిలోని 28 రెవెన్యూ గ్రామాలలో దాదాపు 24,500 ఎకరాల భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటికే 11,500 ఎకరాల భూమి రికార్డుల పరిశీలన జరిగిందని, మరో 13వేల ఎకరాల భూమి వివరాలను పరిశీలించాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. ఇప్పటి వరకు ఎంఏడీఏ కు కార్యాలయం లేని నేపథ్యంలో డీఆర్డీఏ కార్యాలయం పై అంతస్తులో ఈ కార్యాలయాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎంఏడీఏలో నియమించిన డెప్యూటీ కలెక్టర్లను త్వరితగతిన విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరితోపాటు ఒక్కొక్క యూని ట్‌లో రెండు రెవెన్యూ గ్రామాలు ఉంటాయని డెప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, డెప్యూటీ తహసీల్దార్లు ఇరువురు, డెప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్, ఆర్‌ఐ, సర్వేయర్, కంప్యూటర్ ఆపరేటర్లు ఇద్దరిని త్వరితగతిన నియమించాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా మచిలీపట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్లలోని అధికారులు, సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. అప్పటికీ సిబ్బంది కొరత ఉంటే కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల నుంచి ఉద్యోగులను ఎంఏడీఏలోకి తీసుకోవాలని సూచించారు. ఎంఏడీఏ ద్వారా భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, 13వేల ఎకరాల భూమి రికార్డులను పరిశీలించిన అనంతరం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయటం జరుగుతుందని కలెక్టర్ చెప్పా రు. ఎంఏడీఏకు భూసమీకరణ నిమిత్తం కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలుసుకున్న రైతుల్లో అలజడి ప్రారంభమైంది. 24,500 ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటంతో తమ భూములు కోల్పోతామనే భయం రైతులను వెంటాడుతోంది. 2015 ఆగస్టు 29న దాదాపు 30వేల ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ భూసేకరణ నోటిఫికేషన్ గడువు గత ఆగస్టు 29వ తేదీతో ముగియనుండటంతో 12 నెలల పాటు భూసేకరణ నోటిఫికేషన్ గడువును పెంచుతూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భూసమీకరణ నోటిఫికేషన్, భూసేకరణ నోటిఫికేషన్ రెండూ అమలులో ఉన్న నేపథ్యంలో కలెక్టర్ భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించటం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ సమావేశంలో మచిలీపట్నం తహసీల్దార్ బి నారదముని, డెప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.