మొరాయిస్తున్న మోటార్లు!
మొరాయిస్తున్న మోటార్లు!
Published Sat, Aug 6 2016 10:53 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
నాగయ్య అనే రైతుది దోమకొండ మండలం అంబారీపేట గ్రామం. ఆయనకు మూడెకరాల పొలం ఉంది. బోరుపై ఆధారపడి సేద్యం చేస్తున్నాడు. రెండేళ్లుగా సరైన వర్షాల్లేక ఇబ్బందులు పడ్డ నాగయ్య.. ఇటీవల కురిసిన వర్షాలతో పొలంబాట పట్టాడు. కొంతభాగం నాటు కూడా వేశాడు. అంతలోనే బోరు మోటారు పాడైంది. వెయ్యి రూపాయల వరకు కూలీ చెల్లించి మోటారునుపైకి తీయించాడు. మోటారు వైండింగ్‌తో పాటు బేరింగులు చెడిపోయాయని మెకానిక్ చెప్పడంతో మరమ్మతులు చేయించాడు. మరమ్మతులకు రూ. 3,900 అయ్యాయి. తిరిగి మోటారును బిగించడం, ఇతర ఖర్చులన్నీ కలిపి మరో రూ. వెయ్యి అయ్యాయి. అంటే మోటారు, పంపు బాగుకు పంట సాగు మొదట్లోనే అయిన ఖర్చు రూ. 5,900. మోటారు ఎంత కాలం నడుస్తుందో, నీరు ఎంత పోస్తుందో తెలియదు. ఇది ఒక్క నాగయ్య పరిస్థితే కాదు.. బోర్లపై ఆధారపడ్డ రైతులందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కామారెడ్డి : రెండేళ్ల కరువుతో అతలాకుతలమైన రైతాంగం ఇటీవల కురిసిన ఓ మోస్తారు వర్షాలతో ఖరీఫ్ సాగుపై ఆశలు పెంచుకున్నారు. దీంతో పొలంబాట పట్టిన రైతులు బోర్లలో నీటి ఊట పెరిగిందేమోనని మోటార్లను ఆన్ చేస్తే అవి మొరాయిస్తున్నాయి. దీంతో మోటార్లను పైకి తీసి మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. జిల్లాలో లక్షా 45 వేల బోరుబావులు ఉన్నాయి. అనధికారికంగా మరో ఇరవై వేల దాకా ఉంటాయి. అయితే చాలా ప్రాంతాల్లో గత రెండుమూడేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు మూలనపడ్డాయి. అప్పటి నుంచి బోరు మోటార ్లను నడిపించలేకపోయారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలతో కొంతమేర బోర్లు పోసే అవకాశం ఉండడంతో రైతులు బోర్లను స్టార్ట్ చేయడం, అవి మొరాయిస్తుండడంతో మరమ్మతుల కోసం మెకానిక్‌లను ఆశ్రయిస్తున్నారు.
ఒక్కో మోటారు మరమ్మతుకు రూ. 5 వేల పైనే
చాలా కాలంగా నీళ్లు లేక బోర్లలోనే ఉన్న బోరు మోటారు, పంపులను పైకి తీయడానికి గాను తక్కువలో తక్కువ రూ. వెయ్యి వరకు ఖర్చు చేస్తున్నారు. మోటారు వైండింగ్, పంపులో బేరింగులు, ఇతర మరమ్మతులు, అలాగే స్టార్టర్ బాక్సుల మరమ్మతులకు మరో రూ. 4 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు తెలిపారు. మెకానిక్ షెడ్ల వద్దకు నిత్యం పదుల సంఖ్యలో మోటార్లు మరమ్మతుల కోసం వస్తుండడంతో మెకానిక్‌లు రాత్రింబవళ్లు మరమ్మతు పనులు చేస్తున్నారు.
Advertisement
Advertisement