ఎంపీడీవోలు.. విధులకు డుమ్మా!
ఎంపీడీవోలు.. విధులకు డుమ్మా!
Published Sun, Sep 11 2016 5:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
* జెడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి
* మొన్న ముప్పాళ్ల.. తాజాగా బెల్లంకొండ ఎంపీడీవోలకు చార్జి మెమోలు
గుంటూరు వెస్ట్: మండల స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)ది కీలక పాత్ర. అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేంద్ర బిందువుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడంలో వీరిపైనే ప్రధాన బాధ్యత ఉంటుంది. జిల్లాలోని పలువురు ఎంపీడీవోల పనితీరుపై ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కార్యాలయాలకు గైర్హాజరు కావడం, జిల్లాస్థాయిలో సమావేశాలకు హాజరవుతున్నామని చెబుతూ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం వంటి విషయాలు ఇటీవల కాలంలో అధికంగా వెలుగులోకి వస్తున్నాయి.
ముప్పాళ్ల ఎంపీడీవోపై చర్యలకు సీఈవో సిఫార్సు...
ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి గైర్హాజరైన ముప్పాళ్ల ఎంపీడీవో టి.ఉషారాణిపై విచారణ జరిపాలనిSకలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. విచారణ జరిపిన సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్య ఆమె కార్యాలయ విధులకు తరచుగా గైర్హాజరవుతున్నట్లు ధృవీకరించుకున్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు ఫైల్ పెట్టారు. ఈ ఘటన ఎంపీడీవోల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సీఈవో వెంకటసుబ్బయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నెల తొమ్మిదిన బెల్లంకొండ మండల పరిషత్ కార్యాలయాన్ని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి ఎంపీడీవో కేహెచ్ భ్రమరాంబ విధులకు గైర్హాజరైనట్లు తేలింది. దీంతో ఆమెకు చార్జిమెమో అందజేశారు. చార్జిమెమో నుంచి తప్పించుకునే చర్యల్లో భాగంగా భ్రమరాంబ శుక్రవారం సాయంత్రం తనకు 10 రోజులపాటు సెలవులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా పరిషత్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
సగానికిపైగా ఎంపీడీవోలది ఇదే తీరు...
జిల్లాలోని సగానికిపైగా ఎంపీడీవోలు గుంటూరులో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. వారంలో ఒకటి రెండు రోజులు విధులకు హాజరై, మిగిలిన రోజుల్లో సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారనే విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నామంటూ విధులకు గైర్హాజరవుతుండటం గమనార్హం. పల్నాడు ప్రాంత మండలాల్లో విధులు నిర్వహించే ఎంపీడీవోలు ఈ తరహా సాకులు చెబుతూ విధులకు డుమ్మా కొడుతున్నారు. బొల్లాపల్లి ఎంపీడీవో ఎం.అశోక్‌బాబు విధులకు సక్రమంగా హాజరుకారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు కె.సంతోషమ్మ అనేకమార్లు సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తావించడం గమనార్హం. కొంతమంది ఎంపీడీవోలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు చూసుకుని ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో చేపడుతున్న ఆకస్మిత తనిఖీలతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.
Advertisement