– ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం జూలై 5న సచివాలయ ముట్టడి
– ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు
గుంతకల్లు టౌన్ : ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు సర్కార్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు మాదిగలంతా సన్నద్ధం కావాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. గుంతకల్లు పట్టణంలోని రాయల్ ఫంక‌్షన్‌హాలులో మంగళవారం ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు స్వామిదాస్ అధ్యక్షతన జరిగిన మాదిగల ఆత్మగౌరవ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా పోలీసుల చేత అణచివేయించేందుకు కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నిరోజులు తమ మంచితనాన్ని, ఓపికను పరీక్షించారని, ఇలాగే అణచివేతకు గురిచేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అమరావతి, పట్టిసీమ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకోవడంపై చూపిన శ్రద్ధ..వర్గీకరణపై లేదా అని ప్రశ్నించారు. వర్గీకరణకు చట్టబద్ధత, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్, మిగులు భూముల కేటాయింపు కోసం జూలై 5న వెలగపూడిలోని సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఆత్మగౌరవ సదస్సుకు ముందు గుంతకల్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కోటయ్య, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల అధ్యక్షులు సంజయ్, మేకలదాస్, కణేకల్ కృష్ణ, రాయలసీమ బీసీ సంఘం కార్యదర్శి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు సర్కార్‌తో అమీతుమీ
Published Tue, Jun 13 2017 10:18 PM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
Advertisement
Advertisement