కాపులతో కిటకిటలాడుతున్న ముద్రగడ స్వగృహం
Published Thu, Jul 13 2017 11:47 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
- తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండండి
- ముద్రగడ పిలుపు
కిర్లంపూడి (జగ్గంపేట): మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26వ తేదీ నుంచి చావోరేవో చలో అమరావతి పేరుతో నిర్వహించనున్న నిరవధిక పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో కాపు నేతలు ఆయన స్వగృహానికి తరలివస్తున్నారు. దీంతో ముద్రగడ స్వగృహం కాపు నాయకులతోపాటు వివిధ సంఘాల మద్ధతుదారులతో కిటకిటలాడుతుంది. గురువారం కోరుకొండ మండలంలోని గాదరాడ, ప్రత్తిపాడు మండలం ధర్మవరం, పెద్దాపురం మండలం దివిలి గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కాపు యువకులు, నాయకులు మోటారు సైకిళ్లపై భారీగా తరలివచ్చారు. రాజోలు నియోజకవర్గం నుంచి, విశాఖపట్నం నుంచి కార్లపై భారీగా కాపు నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడను ఉద్ధేశించి వారు మాట్లాడుతూ ఈ నెల 26న చేపట్టనున్న పాదయాత్రలో తామూ పాలుపంచుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ చేపట్టనున్న నిరవధిక పాదయాత్రకు చావోరేవో తేల్చుకోవడానికి కాపులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జాతి భావి తరాలు బాగుండాలంటే రిజర్వేషన్లను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాపు యువత క్రమ శిక్షణతో ఈ పాదయాత్రకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, గౌతు స్వామి, చల్లా సత్యన్నారాయణ, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, చక్కపల్లి సత్తిబాబు, సూరత్ వీరవెంకట సత్యన్నారాయణమూర్తి, తూము చినబాబు, చక్కపల్లి సత్తిబాబు, ఆడారి బాబ్జిలు పాల్గొనగా రాజోలు నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు అడబాల నరసింహరావు, వైఎస్సార్ సీపీ నాయకులు యనుముల నారాయణస్వామి, వివిధ పార్టీల నాయకులు తరలివచ్చారు.
.
Advertisement
Advertisement