సీఎం అనుమతి తీసుకున్నట్టు ఆధారం చూపితే నేను తీసుకుంటా
– కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం
–మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పరామర్శించిన ‘ముద్రగడ’
తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : ముఖ్యమంత్రి చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో అనుమతి తీసుకున్నట్టు ఆధారాలు చూపితే తానూ అనుమతి కోసం దరఖాస్తు చేస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం అన్నారు. గురువారం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. గరగపర్రు సంఘటన బాధాకరమని అన్నారు. అంబేడ్కర్‌ను ప్రపంచం మేధావిగా గుర్తించిందని మర్చిపోకూడదని అన్నారు. పాదయాత్రకు అనుమతి విషయమై ఆయన మాట్లాడుతూ సమాధానం ఇస్తూ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడని, ఆలాగే వైఎస్ రాజ శేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారని, సీపీఎం నాయకులు నారాయణ కూడా పాదయాత్రలు చేశారని వీరందరూ అనుమతి తీసుకొని చేశారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రజలకు అండగా ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన జీవి హర్ష కుమార్‌ను ముద్రగడ అభినందించారు.