ముద్రగడకు పెరుగుతున్న మద్దతు
ముద్రగడకు పెరుగుతున్న మద్దతు
Published Tue, Aug 15 2017 10:57 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
కిర్లంపూడికి తరలివచ్చిన పలువురు నాయకులు
ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పద్మనాభం పిలుపు
కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ స్వగృహానికి మంగళవారం తూర్పు ,పశ్చిమగోదావరి జిల్లాల నుండి భారీ సంఖ్యలో కాపు నాయకులు, మహిళలు, పలువురు అభిమానులు , ఎస్సీ, బీసీ కులాలకు చెందిన నాయకులు ముద్రగడ ఇంటికి భారీగా తరలివచ్చి ముద్రగడకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ముద్రగడ చేసే ఉద్యమానికి రిజర్వేషన్ సాధించే వరకు తమ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు కాపునాయకులు, మహిళా నాయకులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన కాపులను మహిళలను ఉద్ధేశించి ముద్రగడతో పాటు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, తోట రాజీవ్ , ఆరేటి ప్రకాశ్, గౌతు స్వామి, జీవీ రమణ, తుమ్మలపల్లి రమేష్ తదితరులు మాట్లాడుతూ కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల సమయంలోనూ, మేనిఫెస్టోలోనూ కాపులకు ఇచ్చిన హామీలనే తప్ప అదనంగా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ముద్రగడ పాదయాత్ర ఆగదని ఇచ్చిన హామీలను సాధించుకునే వరకు ఉద్యమం తీవ్రతరం చేయాలని కాపునాయకులకు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ముద్రగడను కలిసేందుకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, తణుకు, తూర్పు గోదావరి జిల్లా నుండి రాజోలు, కత్తిపూడి, గొల్లప్రోలు , రాయవరం , కొత్తపేట , కాకినాడ, కరప, ఉలిమేశ్వరం, విజయనగరం జిల్లా నుంచి భారీ సంఖ్యలో కాపు నాయకులు మహిళలు తరలివచ్చారు. ఆయన కలిసిన వారిలో మలకల చంటిబాబు, నర్సే సోమేశ్వరరావు, మాకా శ్రీనివాసరావు, గుండుబోగుల నాగు, మారిశెట్టి అజయ్, కొత్తపల్లి సుబ్బలక్ష్మి, పెన్నాడ సూరిబాబు, గౌతు సుబ్రహ్మణ్యం, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సంగిశెట్టి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబి, అడబాల శ్రీను, తోట బాబు, తూము చినబాబు, ఆడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement