కాపు ఉద్యమంలో నిజాయితీ ఉంది: దాసరి
తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ప్రముఖ సినీ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం ఆయన కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పరామర్మించారు.
ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... ముద్రగడ రాసిన లేఖకు చంద్రబాబు నాయుడు అప్పుడే స్పందించి ఉంటే..సమస్య ఇంత వరకూ వచ్చేది కాదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను కాపులు నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాపు ఉద్యమంలో నిజాయితీ ఉందని...చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం కాపు కార్పొరేషన్కు రూ. 2 వేల కోట్లు ఇవ్వడంతో పాటు కాపులను బీసీల్లో చేర్చాలని దాసరి డిమాండ్ చేశారు. ముద్రగడతో ప్రభుత్వం జరిపిన చర్చల అనంతరం సోమవారం దీక్ష విరమించిన విషయం తెలిసిందే.