కాంట్రాక్టర్లు ఏం పాపం చేశారు
విజయవాడ సెంట్రల్: ఏం పాపం చేశారని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని నగరపాలక సంస్థ వైఎస్‌ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల ప్రశ్నించారు. బకాయిల కోసం ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లకు గురువారం పార్టీ కార్పొరేటర్లతో కల్సి ఆమె సంఘీభావం తెలిపారు. ఆమె మాట్లాడుతూ 2009 నుంచి బకాయిలు పెండింగ్ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల జీతాలను క్లియర్ చేసిన తరహాలోనే కాంట్రాక్టర్ల బిల్లుల్ని చెల్లించాలన్నారు. పాలకులు కాంట్రాక్టర్ల న్యాయమైన డిమాండ్‌ను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు.
సమ్మె చేస్తే అభివృద్ధికి ఆటంకం
26వ తేదీ నుంచి సమ్మె జరిగితే నగరాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని పుణ్యశీల అన్నారు. ఇప్పటికే డివిజన్లలో అసంపూర్తిగా పనులు నిల్చిపోయాయన్నారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు సంబంధించి రూ.230 కోట్లు మంజూరయ్యాయని ఇందులో ఎవరెవరికి ఎంతమేర బిల్లులు చెల్లించారో అధికారులు బహిర్గతం చేయాలన్నారు. బడా కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్న టీడీపీ చిన్న కాంట్రాక్టర్ల ఉసురు తీస్తోందన్నారు. ఏళ్ళ తరబడి బిల్లులు రాక ఆర్థికంగా ఛిద్రమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే కార్పొరేషన్లో పనులు చేసేందుకు ఏ కాంట్రాక్టర్ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా మేయర్, కమిషనర్ చొరవ చూసి సమస్యను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు ఆదిబాబు మాట్లాడుతూ తమ పోరాటానికి మొట్టమొదటిగా మద్దతు తెలిపింది వైఎస్‌ఆర్‌సీపీ పార్టీయేనన్నారు. పార్టీ కార్పొరేటర్లు షేక్‌బీజాన్‌బీ, జమల పూర్ణమ్మ, పాల ఝాన్సీలక్ష్మి, కె.దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
మూడవరోజూ కాంట్రాక్టర్ల ఆందోళన
అధికారులు, పాలకుల తీరును నిరసిస్తూ కాంట్రాక్టర్లు చెవిలో పూలతో మూడురోజు ఆందోళనను కొనసాగించారు. నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన, ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు వీరబాబు, అంకేశ్వరరావు మాట్లాడుతూ కమిషనర్ మొండి వైఖరి విడనాడాలన్నారు. జెఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకం పూర్తి కావొస్తున్నా బిల్లులు చెల్లించబోమనడం సరికాదన్నారు. 26 నుంచి నగరంలో ఎక్కడా అభివృద్ధి పనుల్ని జరగనీయమన్నారు. కార్పొరేషన్‌లో డబ్బులు లేవని చెప్పడం తమ చెవిలో పూలు పెట్టడమే అన్నారు. డబ్బుల్లేకుండా రూ.32 కోట్లతో కొత్త భవనం ఎలా కడుతున్నారని ప్రశ్నించారు.యూనియన్ నాయకులు రాఘవేంద్రరావు, సీహెచ్. వెంకటేశ్వరరావు, పి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.