ఆస్తి కోసం దారుణ హత్య
నడిరోడ్డుపై వదినను చంపిన మరిది
అమ్మను చంపొద్దని వేడుకున్నా కనికరించని బాబాయ్
విచక్షణ కోల్పోయి చెంప చెళ్లుమనిపించి..
జుట్టుపట్టి, పీకపై కాలు వేసి ప్రాణం తీసినవైనం
కిర్లంపూడి (జగ్గంపేట) : అతను మానవ మృగాడు. చదువుకున్నానన్న జ్ఞానం లేనివాడు. బీటెక్ చదువుకున్నాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ఆరు నెలల క్రితం సొంత ఊరు కిర్లంపూడి మండలం గోనాడ వచ్చాడు. వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడు. గ్రామంలో ఉంటూ రెండు పాడిగేదెలను కొని ఇంటి వద్దే పాడిపరిశ్రమ పెట్టుకున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుండి సొంత వదినతో ఆస్తి, కుటుంబ కలహాలతో రోజూ తగవుపడుతుండేవాడు. ఎప్పటి లాగే బుధవారం ఉదయం ఇరువురి మధ్యా చిన్న తగాదా మొదలై తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన అతను వదిన అని కూడా చూడకుండా నడిరోడ్డుపై చెంప చెళ్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకుని సిమెంటు రోడ్డుపై పడేసి కొట్టాడు. పీకపై అడుగేసి తొక్కాడు. మృతురాలి కూతురు జ్ఞానేశ్వరి వద్దు బాబాయ్.. వద్దు అమ్మను ఏమీ చేమొద్దు అని బతిమాలినా వినిపించుకోలేదు. జాలి, కరుణ వంటివి లేకుండా విచక్షణ రహితంగా ఇరుగు పొరుగు వారు చూస్తుండగా హత్యకు పాల్పడ్డాడు. హత్య జరిగిన తీరు గ్రామంలో సంచలనం రేకెత్తించింది. విషయం తెలుసుకున్న కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ తన సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించాడు. విషయాన్ని జగ్గంపేట సీఐ పి.కాశీవిశ్వనాథంకు వివరించగా, ఆయన అక్కడకు చేరుకుని హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో సీఐ మాట్లాడుతూ మృతురాలి భర్త సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బీసీ కాలనీలో విషాదఛాయలు
మరిది చేతిలో వదిన భవాని హత్యకు గురికావడంతో బీసీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. భవానికి 12 యేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి ఉంది. తల్లి మృతదేహం వద్ద కూతరు విలపించిన తీరు చూపరులను కలచివేసింది.