తనకు పుట్టబోయే పిల్లల ఆస్తికి అడ్డుపడతాడేమో అనే దురుద్దేశంతో...
రెబ్బెన : తనకు పుట్టబోయే పిల్లల ఆస్తికి అడ్డుపడతాడేమో అనే దురుద్దేశంతో పసిపిల్లాడు అని కూడా చూడకుండా కన్న కొడుకు లాంటి బాలుడిని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా హతం చేసిందో ప్రబుద్ధురాలు. మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలివి.. రెబ్బెనకు చెందిన పిట్టల ప్రభాకర్ ఐకేపీ సీఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని మొదటి భార్య కీర్తన అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం చనిపోయింది. వీరికి కుమారుడు జయసూర్య (6) ఉన్నా డు.
ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం ప్రభాకర్ వేమనపల్లి మండలం బొమ్మ న గ్రామానికి చెందిన సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈనెల 16న ప్రభాకర్ పనినిమిత్తం మం చిర్యాలకు వెళ్లగా.. అతని తల్లి రాజమ్మ ఉపాధిహామీ పని కోసం వెళ్లింది. ఈ క్రమంలోనే తమ ఆస్తి అంతా జయసూర్యకే దక్కుతుందని, తనకు పుట్టబోయే పిల్లలకు ఏమీ రాదనే దురుద్దేశంతో మానవత్వాన్ని మరిచి జయసూర్య ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి అంతమొందించింది. ఆపై తనకేమీ తెలియదన్నట్లు ఉండిపోయింది. మంచిర్యాల నుంచి ఇంటికి వచ్చిన ప్రభాకర్‌కు జయసూర్య బాత్‌రూంలో పడిపోయి మృతి చెందాడని చెప్పి నమ్మించింది. నిజ మని నమ్మిన ప్రభాకర్‌తోపాటు అతని తల్లి శుక్రవారం జయసూర్యకు అంతక్రియలు నిర్వహించారు.
విషయం బయటపడింది ఇలా..
బాలుడిని అంతమొందించిన సునీత ప్రవర్తనలో అనుమానం రావడంతో భర్త ప్రభాకర్‌తోపాటు బంధువులు శనివారం ఉదయం నిలదీశారు. దీంతో జయసూర్యను తానే ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు ఒప్పుకుంది. భవిష్యత్తులో తనకు పుట్టబోయే పిల్లల ఆస్తికి జయసూర్య అడ్డుతగులుతాడనే ఉద్దేశంతోనే ఈ హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ప్రభాకర్ ఫిర్యాదు మేరకు సునీతపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మేరాజొద్దీన్ తెలిపారు.