
నా మద్దతు వైఎస్ వివేకానందరెడ్డికే
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికే తన పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి.రమణారెడ్డి పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు క్రైం: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికే తన పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి.రమణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు తన మద్దతు కావాలని కోరినప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డికే సహకారం అందిస్తానని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. అంతేగాక వైఎస్‌ఆర్‌సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్.వివేకానందరెడ్డి పేరును పార్టీకి తానే ప్రతిపాదించానన్న విషయాన్ని కూడా టీడీపీ నాయకులకు స్పష్టం చేశానని పేర్కొన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు తరుచూ స్థానిక సంస్థల ఎన్నికల విషయమై సంప్రదింపులు జరపడం, తన స్వేచ్ఛకు ఇబ్బంది కలిగిస్తున్న అంశంగా భావిస్తున్నానని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీసీ అభ్యర్థి వైఎస్.వివేకానందరెడ్డికే పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని మరో మారు స్పష్టం చేస్తున్నానని, ఇకనైనా టీడీపీ ఎంపీ సీఎం.రమేష్ తనను సతాయించడం మానుకుంటే బాగుంటుందని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నానని వివరించారు.