హత్య చేసి..నీళ్ల ట్యాంకులో పడేసి
- వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
- దారుణానికి పాల్పడిన ఐదుగురు నిందితులు అరెస్టు
- వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు: కర్నూలు నగరం టీచర్స్ కాలనీ బల్వరీ అపార్టుమెంటుపైన నీళ్ల ట్యాంకులో గుర్తు తెలియని మహిళ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తలపై ఐరన్‌రాడ్డుతో బాది హత్య చేసి నీళ్ల ట్యాంకులో పడేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని మంగళవారం సాయంత్రం ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలీ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలిసి డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన లిఫ్ట్‌మెకానిక్ శ్రీనివాసరెడ్డి, కర్నూలు నగరం భగత్‌సింగ్ నగర్‌కు చెందిన మరో మెకానిక్ కాశపోగు మార్క్ అలియాస్ రాజు, గౌండ పని చేస్తూ జీవనం సాగిస్తున్న కాశపోగు కళ్యాణ్, అపార్టుమెంట్ యజమాని కుమారుడు కర్నూలు నగరం గడ్డ వీధికి చెందిన బల్వరి అబ్దుల్ హఫీజ్ ఎల్తైశ్యామ్, మెకానిక్ అసిస్టెంట్ భగత్‌సింగ్ కాలనీ వాసి మండ్ల సురేష్ తదితరులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
హత్య ఎందుకు చేశారంటే..
కర్నూలులోని కొత్తబస్టాండు వద్ద ఉన్న ఓ మహిళను తీసుకొని శ్రీనివాసరెడ్డి.. బల్వరి అపార్టుమెంట్ పెంటు హౌసుకు తీసుకెళ్లాడు. మిగిలిన నలుగురితో కలిసి శారీరకంగా అనుభవించారు. డబ్బు విషయంలో శ్రీనివాసరెడ్డితో ఆ మహిళ గొడవపడింది. దీంతో సమీపంలో ఉన్న ఐరన్‌రాడ్డుతో ఆమె తలపై బాదగా అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసరెడ్డి, మార్కు, కళ్యాణ్ కలిసి ఆమె మృతదేహాన్ని టెంటుహౌసు పైనున్న వాడుకలోలేని నీటి ట్యాంకులో పడేసి మూతపెట్టి పరారయ్యారు.
బయటపడిందిలా..
ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన అపార్టుమెంట్ వాచ్‌మెన్ బావమరిది అయిన చాకలి రాజు ట్యాంకును శుభ్రం చేసేందుకు మూత తెరిచి చూడగా మృతదేహం బయటపడింది. ఫ్లోరుకు రెండు ప్లాట్లు ప్రకారం నాలుగు ఫ్లోర్లల్లో ఎనిమిది కుటుంబాలు ఇందులో నివాసం ఉంటున్నాయి. చివరి అంతస్తులో పెంట్‌హౌస్ ఉంది. అపార్టుమెంటులో నివాసం ఉన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ నాగేంద్ర పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి అనుమానాస్పదం కింద కేసు నమోదు చేశారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేయడంతో పోలీసుల నుంచి తప్పించుకోలేమని భావించి నిందితులు మంగళవారం ఉదయం కర్నూలు ఆర్‌ఐ దగ్గర లొంగిపోయారు.
వారి నుంచి నేరానికి ఉపయోగించిన ఆయుధం, మృతురాలికి సంబంధించిన ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2016 డిసెంబరు 27వ తేదీన మహిళను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. కేసు మిస్టరీని ఛేదించి.. నిందితులను అరెస్టు చేసినందుకు రెండో పట్టణ సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐలు మోహన్‌కిషోర్‌రెడ్డి, సీహెచ్ ఖాజావలీ, పి.తిరుపాలు, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కరీంబాషా, కానిస్టేబుల్ కృష్ణ, సుంకన్న, వర కుమార్, అయూబ్‌ఖాన్, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులను ఎస్పీ అభినందించారు.