
టీచర్లను పంపండి... పిల్లలను పంపుతాం
♦ సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ముందు నల్లగొండ పేరెంట్స్
♦ భువనగిరి, ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ: మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పంపడం లేదు?
తల్లిదండ్రులు: సార్లను సరిగ్గా పంపండి, మేము కూడా పిల్లలను పంపుతాం.
కమిటీ: ఇప్పటినుంచి సక్రమంగా నడిపితే సర్కారు బడికి పిల్లలను పంపిస్తారా?
తల్లిదండ్రులు: హాయిగా పంపుతాం.. ప్రైవేట్‌లో చదివించాలంటే ఏటా రూ. 30 వేల వరకు ఖర్చవుతోంది. అన్నీ ఉంటే ప్రభుత్వ పాఠశాలలే మేలు కదా.!
ఇదీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ ఎదుట నల్లగొండ జిల్లాలోని తల్లిదండ్రులు వ్యక్తపరిచిన ఆవేదన. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు కమిటీని నియమిం చింది. సీనియర్ న్యాయవాదులు అశోక్‌కుమార్ గుప్తా, టి.వి. రత్నం, వెంకటేశ్వరరావులతో కూడిన ఈ కమిటీ శుక్రవారం జిల్లాలోని ఆలేరు, భువనగిరి, తుర్కపల్లి మండలాల్లోని ఐదు పాఠశాలలను సందర్శిం చి చదువు మాన్పించిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడింది.
పాఠశాలలకు టీచర్లు టైమ్‌కు రావడం లేదని, కొన్ని పాఠశాలల్లో అసలు టీచర్లే లేరని, ఎప్పుడో వచ్చిన టీచర్లు విద్యార్థులను పట్టించుకోవడం లేదని త్రిసభ్య కమిటీకి విన్నవించారు. ఓ పాఠశాలలో అయితే ఫలానా ఉపాధ్యాయుడు ఈ పాఠశాలకు వస్తే తాము పిల్లలను పంపేది లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కొన్ని చోట్ల విద్యార్థులను కొడుతున్నారని, అందుకే సర్కార్ బడికి వెళ్లడంలేదని వివరించారు. చాలాచోట్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం పెట్టించాలని, అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తే తాము పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపుతామని చెప్పారు. అయితే, కమిటీ వస్తున్న సందర్భంగా ఓ పాఠశాలలో అప్పటివరకు పేరుకుపోయిన చెత్తను శుక్రవారం ఉదయం హడావుడిగా తొల గించగా, మరోచోట బురదను కప్పేందుకు హడావుడిగా మట్టిని ట్రాక్టర్‌లో తెచ్చి పోయడం కన్పించింది. ఈ కమిటీతోపాటు పిటిషనర్ తరఫు న్యాయవాది కె. శ్రావణ్‌కుమార్, తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సాగర్‌రావు ఉన్నారు.