నల్ల వ్యవహారం బట్టబయలు
Published Tue, Dec 20 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
తణుకు : ఒకే ఆధార్ కార్డు.. 50 జిరాక్సు కాపీలతో నగదు మార్పిడి చేసిన వ్యవహారం బట్టబయలైంది. ఇతర ఖాతాల ద్వారా కొత్తనోట్లు బదిలీ చేసిన వ్యవహారం వెలుగుచూసింది. తణుకు ఎస్‌బీఐ ప్రధాన కేంద్రంగా సాగిన అక్రమ లావాదేవీలు బయటపడటంతో.. దీనికి బాధ్యుడిగా భావిస్తూ ఆ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్‌బీఐ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. బడా బాబులకు నోట్లు కట్టబెట్టడానికి కొందరు బ్యాంకు అధికారులు సహకరిస్తున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాల ఆధారంగా దర్యాప్తు మొదలైంది. సుమారు వారం రోజులపాటు తణుకు ఎస్‌బీఐ ప్రధాన శాఖలో ఆర్‌బీఐ అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 9, 10, 11 తేదీల్లో ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు అధికారులు లావాదేవీలు జరిపినట్టు భావిస్తున్నారు. ఏజీఎం కృష్ణారావును గత బుధవారమే విజయవాడ కేంద్ర కార్యాలయానికి అటాచ్ చేసి టి.సునిల్‌కుమార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆదినుంచీ అనుమానమే..
కొందరు నల్ల కుబేరులకు నోట్లు చేరవేతలో తణుకు పట్టణంలోని కొన్ని బ్యాంకులు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇందులో తణుకు ఎస్‌బీఐ శాఖ ప్రధాన భూమిక పోషించినట్టు సమాచారం. సాధారణంగా ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ఎస్‌బీఐ శాఖలను రిజర్వు బ్యాంకు చెస్ట్‌లుగా పిలుస్తుంటారు. రిజర్వు బ్యాంకు నుంచి నేరుగా ఇక్కడికే నగదు వస్తుంటుంది. అయితే నోట్ల్ల రద్దు అనంతరం ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తణుకు చెస్ట్‌లో రూ.10 కోట్లు పరిమితి కాగా సాధారణ రోజుల్లో రోజుకు రూ.10 కోట్లు లావాదేవీలు జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం రోజుకు రూ.కోటిలోపు నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత 9, 10, 11 తేదీల్లో నగదు చెల్లింపుల్లో రిజర్వు బ్యాంకు నిబంధనలు పాటించాలనే ఆదేశాలున్నాయి. వాటిని బేఖాతరు చేస్తూ పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపినట్టు భోగట్టా. నిబంధనల మేరకు ఖాతాలున్న వారికి వారానికి రూ.24 వేల చొప్పున నెలకు రూ. 96 వేలు పొందే అవకాశం ఉంది. కరెంట్ ఖాతాదారు వారానికి రూ.50 వేల చొప్పున నెలకు రూ.2 లక్షలు మాత్రమే తీసుకోవాలి. బ్యాంక్ ఖాతాలు లేనివారి నుంచి రోజుకు రూ.4 వేలు పాత నోట్లు తీసుకుని అదే మొత్తంలో కొత్త నోట్లు ఇవ్వాలనే నిబంధన విధించారు. పా¯ŒSకార్డు లేని వారి నుంచి రూ.49 వేలు పరిమితి వరకు డిపాజిట్లు చేయించుకున్నారు. అయితే బడాబాబుల నుంచి అందిన లక్షలాది రూపాయలను నమ్మకస్తుల ఖాతాల్లోకి రూ.49 వేలు చొప్పున పాత నోట్లు భారీగా డిపాజిట్ చేసి, తరువాత వారి ఖాతాలకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు
ఎస్‌బీఐ ఏజీఎం కృష్ణారావు సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఏజీఎం కృష్ణారావు ఎవరెవరికి సహకరించారు, ఎంత మొత్తంలో నల్లధనం మారిందనే విషయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వ్యవహారం బట్టబయలు కావడంతో ఎవరి పేర్లు బయటకు వస్తాయో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పట్టణంలోని మరో జాతీయ బ్యాంకులోనూ ఈ తరహా అక్రమాలు జరిగాయనే ప్రచారం ఉంది. దీనిపైనా అధికారులు ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Advertisement
Advertisement