నంద్యాల గెలుపును జగన్‌కు కానుకగా ఇస్తాం | nandyal winning gift to jagan | Sakshi
Sakshi News home page

నంద్యాల గెలుపును జగన్‌కు కానుకగా ఇస్తాం

Jul 6 2017 12:36 AM | Updated on Aug 14 2018 2:50 PM

నంద్యాల గెలుపును జగన్‌కు కానుకగా ఇస్తాం - Sakshi

నంద్యాల గెలుపును జగన్‌కు కానుకగా ఇస్తాం

నంద్యాల ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

- రూ.5వేల కోట్లు ఖర్చు చేసినా టీడీపీ గెలవదు
- కార్యకర్తల సమావేశంలో శిల్పా మోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి
నంద్యాల అర్బన్‌: నంద్యాల ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలన్నారు. ఈ ఉప ఎన్నిక గెలుపు 2019  ఎన్నికలకు మలుపు కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీనియర్‌ నాయకుడు కల్లూరి రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ  2019లో జగన్‌ను సీఎంగా చూడాలంటే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తే విజయం తథ్యమన్నారు. ఎన్నికలున్నాయి కాబట్టే నంద్యాల అభివృద్ధిపై అధికార పార్టీకి ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, రోడ్డు వెడల్పు అంటూ హడావుడి చేస్తూ ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని విమర్శించారు.
 
తాను టీడీపీలో ఉన్నప్పుడు నంద్యాల అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అప్పట్లో నిధులు మంజూరు చేయని ప్రభుత్వం ఓటమి భయంతో  ఇప్పుడు ఆగమేఘాలపై పనులు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టినా నంద్యాలలో టీడీపీ గెలవలేదన్నారు. రాజగోపాల్‌రెడ్డికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, పరస్పర సహకారంతో ముందుకు సాగి వైఎస్సార్‌ ఆశీస్సులతో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శిల్పా విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. శిల్పాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే తనకు బాధ్యతలు పెరిగాయన్నారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో మూడేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయని ప్రభుత్వం.. పదిరోజుల్లో పనులు ప్రారంభించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ భీమవరం నాయకులు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ శిల్పాను గెలిపించాలనే పట్టుదలతో కార్యకర్తలు కదలాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు ద్వారం వీరారెడ్డి, సాయినాథరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, మాధవరెడ్డి, మండల నాయకులు భాస్కరరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, కాపు సంఘం నేత రంగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
పలువురు చేరిక 
నంద్యాల ఆరో వార్డు కౌన్సిలర్‌ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో 300 మంది టీడీపీ కార్యకర్తలు,  టీడీపీ సీనియర్‌ నాయకుడు రామచంద్రుడు, ఆయన అనుచరులు 200మంది బుధవారం శిల్పా సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. శిల్పా మోహన్‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి,  మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ సిద్ధంశివరాం, మున్సిపల్‌ కో ఆప్షన్‌ మెంబర్‌ దేశం సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు అనిల్‌ అమృతరాజు, సుబ్బరాయుడు, పార్టీ నాయకులు జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, కారు రవికుమార్, బాషా తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement