యువతకు ఎన్‌పీ టెల్ ఒక వరం
యువతకు ఎన్‌పీ టెల్ ఒక వరం
Published Wed, Jan 4 2017 10:27 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్
కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సదస్సు
కోరంగి (తాళ్లరేవు) : దేశంలోని యువతకు ఎన్‌పీ టెల్ ఒక వరమని నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హేన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీ టెల్) కో-ఆర్డినేటర్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ తెలిపారు. కోరంగిలోని కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశంలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉన్నందున కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థికి సైతం ప్రపంచ స్థాయి సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో ఎన్‌పీ టెల్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ఆయా ఇంజనీరింగ్, డిగ్రీ, మేనేజ్‌మెంట్ సైన్సెస్, కళాశాలల్లోని అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. వెయ్యికి పైగా కోర్సులను అందిస్తున్నట్టు తెలిపారు. దేశంలో సుమారు 80 శాతం మంది ఈ కోర్సులను ఉపయోగించుకుంటున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల మంది ఎన్‌పీ టెల్ కోర్సుల్లో చేరారని తెలిపారు. ఎన్‌పీ టెల్ రీజనల్ మేనేజర్ భారతి మాట్లాడుతూ యువతను సాంకేతిక విజ్ఞానంలో నిష్టాతులను చేసేందుకు దూర విద్యను రూపొందించినట్టు తెలిపారు. ఈ నెల 23 వరకు 4, 6, 12 వారాల కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. సాఫ్ట్ స్కిల్స్, ఆంగ్ల విద్య, లీడర్‌షిప్, ఇన్‌ఫర్‌మేషన్ సెక్యూరిటీ తదితర అధునాతన మార్పులపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతీవారం విద్యార్థులకు వారాంతపు పరీక్షలు నిర్వహించి టీసీఎస్ ఐకాన్ ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. ఈ కోర్సులలో నేర్చుకున్నవారు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు కైట్ కళాశాలను రీజినల్ సెంటర్‌గా గుర్తించినట్టు ఆమె తెలిపారు.
Advertisement