సాహితీ సొబగులు ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి
సాహితీ సొబగులు ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి
Published Sat, Feb 11 2017 10:48 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
మాదే చివరి తరం కాకూడదు : తనికెళ్ల భరణి
శాంతికోసం పోరాటాలు సాగించాలి : భువన చంద్ర
సంస్కారాన్ని తెలియజేసేది ఇంటిలోని గ్రంథాలయమే : ఖదీర్‌బాబు
ఘనంగా రెండో యువతరం జాతీయ తెలుగు సాహిత్య సమ్మేళనం
రాజమహేంద్రవరం/కాకినాడ కల్చరల్ : ‘సాహితీ సొబగుల ఆస్వాదనలో మాదే చివరి తరం కాకూడ’దని ప్రముఖ సినీనటుడు, సాహితీవేత్త తనికెళ్ళ భరణి అన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, పీఆర్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన రెండో యువతరం జాతీయ తెలుగుసాహిత్య సమ్మేళనంలో ఆయన విశిష్ట అతిథిగా ప్రసంగించారు. ‘నేటి తరానికి దేవులపల్లి, గురజాడ కూడా ఎవరో తెలియదని, వేదం వేంకట్రాయశాస్త్రి ఏమి రాశారో తెలియదని ఆవేదన చెందారు. ఎందరో మహానుభావులు అమూల్యమైన సాహితీ సంపదను మనకు వదిలి వెళ్లారని, దాన్ని మనం పరిరక్షించుకోవాలని సూచించారు. ‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అని ఒక దర్శకుడు సెట్‌మీద నటులచేత పలికిస్తున్నాడు... సెట్‌మీద ఉన్న నటుడు గుమ్మడి ‘అప్పిచ్చువాడు, వైద్యుడు’ అని పలకాలని సూచించారు, దర్శకుడు దీనికి తిరస్కరించడంతో గుమ్మడి విగ్ తీసేసి, బయటకు వెళ్ళిపోయారని గుర్తు చేశారు. రాయలి ఆముక్త మాల్యద, పోతన భాగవతం, ధూర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యం నుంచి పలు పద్యాలను ఆయన అలవోకగా వినిపించి విద్యార్థులను ఆకట్టుకున్నారు.
గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ పసిపిల్లవాడు పడిలేస్తూ నడక నేర్చుకున్నట్టే, యువత సాహిత్యంలో కృషి చేయాలన్నారు. ‘శాంతి కోసమే యువత పోరాటాలు చేయాలి, ఇంగ్లిష్ భాషను తప్పకుండా నేర్చుకోవాలి...ఎందుకంటే వారికి ఆ భాషలోనే సమాధానం చెప్పాలి కనుక. కానీ అమ్మ భాషను విస్మరించకూడద’న్నారు. తెలుగు భాషా వికాసానికి మనం ‘కలిసే ముందుకు సాగుదాం–కలుపుకుని సాగుదా’మని చెప్పారు.
మహమ్మద్ ఖదీర్‌బాబు మాట్లాడుతూ నేటి ప్రభుత్వం ఒక లాప్‌టాప్, మొబైల్ ఉచితంగా ఇస్తానంటోంది, కానీ ఒక మంచి పుస్తకాన్ని ఇస్తానని అనడం లేదని వ్యాఖ్యానించారు. ఇంటి సంస్కారాన్ని తెలియచేసేది ఆ ఇంటిలోని గ్రంథాలయమేనని చెప్పారు. జీవిత ప్రస్థానంలో సాహిత్యాన్ని మించిన సాధన లేదన్నారు. వందేళ్ల తెలుగు కథాసాహిత్యంలో... ఎవరూ ముస్లిం కథలు రాయని తరుణంలో, ఉర్దూ మాతృభాషగా ఉన్న తాను తెలుగులో దర్గామిట్టా కథలు రాశానని ఖదీర్‌బాబు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ వ్యస్థాపకుడు వంగూరి చిట్టెన్‌రాజు మాట్లాడుతూ సాహిత్యం లేకపోతే త్యాగయ్య లేరు... బాలమురళి లేరు.. మీరు లేరు... నేను లేనని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ చప్పిడి స్వాగత వచనాలు పలికారు. కళాశాల విద్యార్థులు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ‘జయ జయ ప్రియ భారత’ గీతాన్ని ఆలపించారు. పీఆర్ కళాశాల, వంగూరి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యువతరం రచనల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
మనకున్న ఉచ్ఛారణ సంపద ఎవరికీ లేదు
తెలుగుభాషలో 56 అక్షరాలు ఉంటే, ఇంగ్లిష్‌లో 26 అక్షరాలతోనే అంతా నిర్వహించుకోగలమని ఆంగ్లేయులు అంటున్నారు. ‘లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా?’ అని వాళ్లను అనమనండి. మనకున్న ఉచ్ఛారణ ఎవరికీ లేదు. సవరించే తెలివి ఉంటే, ప్రతి తప్పూ ఒక ఒప్పు అవుతుంది. తర్కంతో మాత్రమే నిలబడితే, ప్రతి ఒప్పు ఒక తప్పుగా కనిపిస్తుంది.
- భువనచంద్ర, సినీగేయ రచయిత
చిన్న కథ జీవిసత్యాన్ని ఆవిష్కరించగలదు
వేయి మత గ్రంథాలు చదవడం కన్నా, వేయి మందితో మాట్లాడటం కన్నా, ఒక చిన్న కథ జీవిత సత్యాలను ఆవిష్కరించగలదు. చలాన్ని చదివాను... స్త్రీని అర్థం చేసుకోగలిగాను, భార్యను గౌరవించడం నేర్చుకున్నాను. కొడవటిగంటి కుటుంబరావును చదివాను... మధ్యతరగతి మానవుడి సమస్యలను ఆకళింపుచేసుకోగలిగాను. శ్రీశ్రీని చదివాను... ప్రపంచంలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని ఆకళింపు చేసుకోగలిగాను.
- మహమ్మద్ ఖదీర్‌బాబు, రచయిత
Advertisement