
రాజధాని సమీపంలో ‘ఇకో నగరం’
♦ త్వరలో కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం: వెంకయ్యనాయుడు
♦ ‘స్వర్ణ భారత్ ట్రస్టు’ హైదరాబాద్ చాప్టర్‌కు భూమి పూజ
శంషాబాద్ రూరల్: హైదరాబాద్ సమీపంలో ‘ఇకో నగరం’ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో ‘స్వర్ణ భారత్ ట్రస్టు’ హైదరాబాద్ చాప్టర్‌కు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ‘ఇకో నగరం (పర్యావరణహిత నగరం)’ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. ఇక్కడ ఉన్న పురాతన భవనాలను తొలగించి ఆకాశ హర్మ్యాలు నిర్మించడమా, నగరానికి దూరంలో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి కాలుష్యరహిత నగరంగా ఏర్పాటు చేయడమా అనే దానిపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నగరాల నిర్మాణంలో విదేశీ నమూనాలను అనుసరించకుండా, అక్కడి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకోవాలన్నారు.
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ‘స్వర్ణ భారతి ట్రస్టు’ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు వీలుగా వృత్తి నైపుణ్యం, కంప్యూటర్ శిక్షణ, రైతులకు వ్యవసాయ సాగులో శిక్షణ ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో ఫార్మా రంగం లో అధికంగా ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ట్రస్టు ఆధ్వర్యంలో ఫార్మా పాఠశాల ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తామన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టుకు మైహోం సంస్థ తరఫున జూపల్లి రామేశ్వర్‌రావు ఆరున్నర ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వగా, వెంకయ్యనాయుడు కుమార్తె గీత ట్రస్టు వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.
‘అమృత్’లో అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని ‘అమృత్’ పథకంలో చేర్చుతున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇక్కడ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ భవిష్య త్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఏపీ ప్రజలు ఆశించిన దాని కంటే ఎక్కువగానే కేంద్రం నుంచి సహాయం అందిస్తామని... విభజన తర్వాత జరిగిన అన్యాయం, నష్టాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కేవలం ప్యాకేజీలతో అయిపోదని, కేంద్రానికి ఉన్న పరిమితులకు లోబడి నిరంతర ప్రక్రియతో ఏపీకి సహకారం అందిస్తామని చెప్పారు. తెలంగాణ, ఏపీ సీఎంలు ఇరుగు పొరుగు వారిలా కాకుండా, అన్నదమ్ముల్లా కలసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు.