‘సాక్షరం’ సగమే..!
‘సాక్షరం’ సగమే..!
Published Wed, Sep 7 2016 9:30 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
మోర్తాడ్/బాల్కొండ : సంపూర్న అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. తొలుత అక్షర కిరణం, తర్వాత నిరంతర విద్యా కేంద్రాల ద్వారా వయోజనులకు విద్య తదితర కార్యక్రమాలు నిర్వహించింది. ఆ తర్వాత సాక్షర భారత్‌ను ప్రారంభించింది. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ మిషన్ ఐదు విడతలుగా కొనసాగింది. ఆరో విడతపై సందిగ్ధం నెలకొంది. అయితే, సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం నెలకొనడంతో లక్ష్యానికి అనుగుణంగా అక్షరాస్యత శాతం వృద్ధి చెందడం లేదు. జిల్లాలో ఇప్పటికీ అక్షరాస్యత శాతం 61.25 శాతం మాత్రమే.
ప్రాథమిక విద్యను నిర్బంధం చేయడంతో మైనర్లలో నిరక్షరాస్యత శాతం తగ్గింది. అయితే నిరక్ష్యరాసులలో ఎక్కువ మంది వయోజనులే ఉన్నారు. నిరక్షరాస్యుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండగా, పురుషుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో పురుషుల అక్షరాస్యత 71.47 శాతం కాగా, మహిళల్లో 51.54 శాతంగా నమోదైంది. మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటంతో వారిలో అక్షరాస్యతను పెంచడానికి సాక్షరభారత్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతీ గ్రామంలో కేంద్రాలు ఏర్పాటు చేసి, నిరక్షరాస్యత శాతం తగ్గించాలని భావించారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రతి గ్రామానికి ఇద్దరు కో–ఆర్డినేటర్‌లను నియమించారు. ప్రతి కో–ఆర్డినేటర్ ఒక్కో దశలో కనీసం 50 మందికి చదువు చెప్పాల్సి ఉంది. కాగా రాత్రిపూట ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోవడం, పొద్దంతా పని చేసి అలసిపోయి ఉండటంతో నిరక్ష్యరాసులు చదువుపై ఆసక్తిని చూపలేక పోతున్నారు. నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి, వారిని చదువుకొనేలా ప్రోత్సహించే ప్రయత్నాలు పెద్దగా కనిపించట్లేదు. దీంతో అక్షరాస్యత శాతం వృద్ధి చెందలేకపోతుంది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు చొరవ తీసుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తే కొంతలో కొంతైనా మార్పు వచ్చే అవకాశముంది. సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశగా ఇకనైనా చకచకా అడుగులు వేయాల్సి ఉంది.
మండలాల వారీగా అక్షరాస్యత శాతం..
మండలం పురుషులు మహిళలు మొత్తం
ఆర్మూర్ 78.39 57.84 67.87
బాల్కొండ 72.62 51.64 61.61
బాన్సువాడ 70.51 53.13 61.42
భీమ్‌గల్ 72.85 50.16 61.14
భిక్కనూర్ 70.42 47.16 58.47
బిచ్కుంద 63.53 43.29 53.36
బీర్కూర్ 63.02 42.23 52.28
బోధన్ 74.38 60.25 67.31
ధర్పల్లి 68.72 45.29 56.40
డిచ్‌పల్లి 71.44 49.88 60.29
దోమకొండ 71.86 48.16 59.74
గాంధారి 60.03 37.24 48.66
జక్రాన్‌పల్లి 72.93 48.98 60.49
జుక్కల్ 59.39 41.08 50.40
కామారెడ్డి 82.29 63.20 72.56
కమ్మర్‌పల్లి 68.12 45.23 56.29
కోటగిరి 65.60 49.02 57.10
లింగంపేట్ 60.92 37.30 48.68
మాచారెడ్డి 63.42 41.11 51.88
మద్నూర్ 65.99 47.48 56.85
మాక్లూర్ 71.81 48.06 59.31
మోర్తాడ్ 70.05 48.64 58.91
నాగిరెడ్డిపేట్ 62.89 38.65 50.16
నందిపేట్ 69.50 46.13 57.21
నవీపేట్ 69.36 49.85 59.38
నిజామాబాద్ 81.54 66.24 73.81
నిజాంసాగర్ 63.48 39.22 50.89
పిట్లం 59.87 40.68 50.09
రెంజల్ 67.64 51.95 59.73
సదాశివనగర్ 69.17 44.13 56.30
సిరికొండ 64.41 43.09 54.27
తాడ్వాయి 63.82 42.29 52.58
వేల్పూర్ 73.26 49.42 60.63
వర్ని 66.23 47.45 56.58
ఎడపల్లి 69.86 52.55 60.91
ఎల్లారెడ్డి 68.87 46.03 57.10
మొత్తం 71.47 51.54 61.25
నిర్వహణ గాలికి..
సాక్షర భారతి కేంద్రాల నిర్వహణ గాలికొదిలేశారు. జిల్లా వ్యాప్తంగా 718 వయోజన కేంద్రాలు ఉన్నాయి. 1436 గ్రామ కో–ఆర్డినేటర్లు, 36 మంది మండల కో–ఆర్డినేటర్లు ఉన్నారు. రెండేళ్లుగా కేంద్రాల నిర్వహణకు చిల్లీ గవ్వ కూడా విదిల్చలేదు. వయోజన కేంద్రాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే క్రమంలో న్యూస్ పేపర్ తప్పకుండా వేయించాలి. అయితే, రెండున్నరేళ్లుగా ప్రభుత్వం పేపర్ బిల్లు చెల్లించట్లేదు. దీంతో చాలాచోట్ల పేపర్ వేయించడమే మానేశారు. మరోవైపు కో–ఆర్డినేటర్లకు గతేడాది అక్టోబర్ నుంచి వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో–ఆర్డినేటర్లపైనే కేంద్రాల నిర్వహణ భారం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్నింటిలో వినియోగించుకుంటూ..
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాల అమలులో సాక్షర భారతి గ్రామ కో–ఆర్డినేటర్లను వినియోగించుకుంటున్నారు. జీవో నెం.203 ప్రకారం సాక్షర భారతి కో–ఆర్డినేటర్లు పూర్తి స్థాయి కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగులు అని పేర్కొన్నారు. కానీ, వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తించేవి ఏవీ కూడా అమలు చేయడం లేదు. హరితాహరంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగానే వీరినే వినియోగించుకున్నారు కానీ ఎలాంటి గుర్తింపు నివ్వలేదు.
‘ఆరో విడత’పై సందిగ్ధం
సాక్షర భారతి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఐదు విడతలుగా కార్యక్రమాలు నిర్వహించారు. 6వ విడత కోసం నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేశారు. కానీ పుస్తకాల పంపిణీ కాని, నిర్వహణ కానీ లేకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రారంభమవుతుందో.. లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో–ఆర్డినేటర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15న నుంచి సమ్మె నిర్వహించాలని నిర్ణయించారు. మండలాల వారీగా తిరుగుతు కో–ఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సాక్షరభారతి కేంద్రాల నిర్వహణతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కో–ఆర్డినేటర్ల డిమాండ్ చేస్తున్నారు.
11 నెలల వేతనాలు రాలేదు..
11 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్రామ కో–ఆర్డినేటర్ల కు ఎలాంటి పని చెప్పలేక పోతున్నాం. వెంటనే వేతనాలు మంజూరు చేయాలి.
– శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
వచ్చినవి విడుదల చేయట్లేదు..
11 నెలల వేతానల్లో రెండు నెలల వేతనాలు మంజూరయ్యాయి. కానీ ఆ వేతనాలు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అసలు చెల్లిస్తారో లేదో కూడా తెలియడం లేదు.
– శ్రీధర్, ప్రధాన కార్యదర్శి
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించట్లేదు
సాక్షర భారతి కో–ఆర్డినేటర్లను పూర్తి స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు. అన్ని పథకాల అమలులో మా సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు.
– శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు
Advertisement