అక్షరం నేర్పని సాక్షరం
అక్షరం నేర్పని సాక్షరం
Published Wed, Sep 7 2016 10:47 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్: అందరికీ అక్షరజ్ఞానం కలిగించాలన్న ప్రభుత్వ ఆశయం క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదు. సాక్షర భారతి కార్యక్రమం ద్వారా అక్షరం నేర్పకున్నా రూ.లక్షల ప్రజాధనం వృథా అవుతుంది. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అనేక మంది నిరక్షరాస్యులను విద్యాభ్యాసం నేర్పించి వారికి పరీక్షలు కూడా నిర్వహించి అక్షరాస్యులుగా మార్చినట్లు లెక్కలు చూపిస్తున్నా అవి కాకిలెక్కలే అవుతున్నాయి. వయోజన విద్యాశాఖలో పర్యవేక్షణకు తగినంత సిబ్బంది లేకపోవడం అలాగే గ్రామ సమన్వయకర్తల పోస్టులు ఖాళీగా ఉండటం వలన నిరక్షరాస్యులకు అక్షరజ్ఞానం కలిగించేవారు లేకుండా పోయారు. ఐదు దశలు పూర్తయినా ఇందూరు జిల్లా 70 శాతం అక్షరాస్యతను కూడా చేరుకోక పోవడం ఆందోళనను కలిగిస్తోంది. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లాలో సాక్షరభారతి అమలుపై ప్రత్యేక కథనం.
‘అక్షరం’ పేరిట రూ.లక్షలు ఖర్చు
జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన ఐదు దశల్లో జిల్లా వ్యాప్తంగా 5,67,200 మంది వయోజనులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యం విధించుకున్నారు. ఇప్పటి వరకు 3,90,909 మందిని అక్షరాస్యులుగా చేశామని లెక్కలు చెబుతున్నారు. ఈ గణాంకాల ప్రకారం ఒక్కరికి అక్షరజ్ఞానం కలిగించడానికి సగటున రూ.626 ఖర్చు చేశారు. అలాగే అక్షరజ్ఞానం కలిగిన వారిలో 20 శాతం చదువుకున్న వారికే అక్షరాలు నేర్పి లెక్కలు చూపారని క్షేత్ర స్థాయి సర్వేలు చెపుతున్నాయి. సిబ్బంది తగిన సంఖ్యలో లేక పర్యవేక్షణ లేకపోవడం కొన్ని గ్రామాల్లో వయోజనులకు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియక పోవడం, సమన్వయకర్తల పనితీరు బాగా లేకపోవడం వంటి కారణాలతో రూ.లక్షలు ఖర్చు అవుతున్న లక్ష్యం చేరడం లేదు. వయోజన శాఖలో పనిచేస్తున్న ఇంత మంది సిబ్బంది పరీక్షలు, పుస్తకాలు, పెన్నుల పేరుతో, సమన్వయకర్తలకు అందించిన జీతాలను ఇవ్వకుండా అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్షరాస్యత సాధన కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నా కొందరు అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలు, అవినీతి ప్రభుత్వ ఆశయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.
ఖాళీగా 120 గ్రామ సమన్వయకర్తల పోస్టులు
జిల్లాలో ప్రస్తుతం 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామానికి ఇద్దరు సమన్వయకర్తల చొప్పున 1,436 మంది ఉండాలి. 18 మండలాల్లో 120 గ్రామ సమన్వయకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమన్వయకర్తలు పనిచేస్తున్న గ్రామాల్లో కేంద్రాలు రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు.. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు తెరిచి వయోజనులకు అక్షరజ్ఞానం కలిగించాలి. జిల్లాలో 75 శాతం కేంద్రాలు మూసి ఉంటున్నాయి. లక్షలు ఖర్చు చేస్తున్న నిధులు సరైన సమయంలో రాక సమన్వయకర్తల వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నందువల్ల వారు నిర్వహిస్తున్న విధుల పైన నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలో సాక్షరత కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించుటకు సిబ్బంది లేకుండా పోయారు. అసలు రథసారధి అయిన ఉప సంచాలకులు పోస్టు ఖాళీగా ఉంది. అలాగే ప్రాజెక్టు అధికారి పోస్టు కూగా ఖాళీగా ఉంది. అలాగే పర్యవేక్షణ పోస్టులు 15 ఉండగా అన్ని పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల కేంద్రాల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. దీనికితోడు సహాయ ప్రాజెక్టు అధికారి పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. అలాగే రెండు మండలాల్లో మండల సమన్వయకర్తలు లేక మండల సాక్షరభారతి లక్ష్యం కుంటుపడుతున్నది.
ఆదర్శ కేంద్రాలలో పరిస్థితే అధ్వానం
గతేడాది జిల్లాలో డివిజన్‌కు రెండు చొప్పున ఆరు ఆదర్శ వయోజన విద్యాకేంద్రాలు ప్రారంభించారు. నవీపేట మండలం పొతంగల్, బాల్కొండ మండలం నల్లూర్, నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్, బాన్సువాడ మండలం హన్మాజీపేట, కామారెడ్డి మండలం క్యాసంపల్లి, ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌లో ఆదర్శ వయోజన విద్యాకేంద్రాలు నెలకొల్పారు. ప్రతి కేంద్రానికి రూ. 2.30 లక్షలతో కంప్యూటర్, ఫర్నిచర్, ఇతర సామగ్రి సరఫరా చేశారు. ఆరు కేంద్రాలకు రూ.13.80 లక్షలు ఖర్చు చేసిన అన్ని మూలకు చేరాయి. చాలా కేంద్రాలలో అంతర్జాల సౌకర్యం లేక గ్రామంలోని యువకులకు, వయోజనులకు ఈ –లెర్నింగ్ కలగానే మిగిలింది. జిల్లాలో మూడేళ్ల క్రితం ఒక్క కేంద్రానికి రూ. 1400 విలువ గల ఒక బీరువ, కార్పెట్, కుర్చీలు, క్యారంబోర్డు, పూలజూదం, కంజర కైలాసం, చెస్‌బోర్డు, పచ్చిసు, కోలాటం, చైవిస్‌చక్కర తదితర ఆటవస్తువులు అందించారు. అలాగే రూ.4,986 విలువ గల 500 వందల కథల పుస్తకాలు, విజ్ఞాన పుస్తకాలు అందించారు. అవన్ని ప్రస్తుతం మూలకు చేరాయి. అయితే సమన్వయకర్తలు మాత్రం కేంద్రానికి రావడం లేదని వయోజనులు సమాధానం చెబుతున్నారు.
ఐదు దశల్లో ఇలా..
1వదశ(2010–11) 70,000 50,839 2,28,42,348 1,55,60,000
2వదశ(2011–12) 79,000 62,500 5,98,68,928 3,73,44,000
3వదశ(2012–13) 3,00,000 1,86,789 5,32,50,213 3,34,43,377
4వదశ(2013–14) 75,120 55,025 7,21,72,761 3,48,76,836
5వదశ(2014–15) 43,080 35,756 3,65,79,345 2,59,10,990
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
5,67,200 3,90,909 24,47,13,595 14,71,35,203
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
Advertisement