నిర్లక్ష్యాన్ని సహించం
-
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
-
టీఎస్‌ఎంఆర్‌ఈఐ ప్రాజెక్ట్ మేనేజర్ ఎజాస్ అహ్మద్
బాన్సువాడ:
మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు ప్రారంభించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎజాస్ అహ్మద్ స్పష్టం చేశారు. బాన్సువాడలోని మైనార్టీ గురుకులాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మైనార్టీ గురుకులాకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌లు, భోజన ఏజెన్సీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయని, వారిపై ప్రత్యేకంగా విజిలెన్స్ నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులు విధులను నిర్లక్ష్యం చేస్తే తొలగించి కొత్త వారిని నియమిస్తామన్నారు. త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరుగుతుందన్నారు. గురుకులాలు ప్రారంభమై మూడు నెలలవుతోందని, ప్రారంభం కొన్ని ఇబ్బందులుంటాయన్నారు. ఏడాదిలోపు ఒక్కో గురుకులానికి ఐదు ఎకరాల చొప్పున భూమి సేకరించి రూ.20కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తామన్నారు. మలావత్ పూర్ణను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట విజిలెన్స్ అధికారులు వీరేశం, ఉస్మాన్ అలీ, పాండురంగం, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అలీముద్దిన్ బాబా, నాయకులు మహ్మద్ ఎజాస్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు తదితరులున్నారు.