నెహ్రూ అనుచరుల జులం!
– అంతర్గత విభేదాలతో కల్వర్టు తొలగించే యత్నం
– అడ్డుకున్న అపార్టుమెంట్ వాసులకు బెదిరింపులు
– బాధితులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే వంశీ మోహన్
రామవరప్పాడు :
ఒక అపార్టుమెంట్‌కు చెందిన కల్వర్టును మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చేందుకు యత్నించడం వివాదాస్పదమైంది. ఎనికేపాడు బీవీరావు కల్యాణ మండపం సమీపంలోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ వాసులు రాకపోకలు సాగిచేందుకు కాలువపై నిర్మించుకున్న కల్వర్టును నెహ్రూ అనుచరులు పది మంది పొక్లెయిన్‌తో ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన అపార్టుమెంట్‌వాసులను అడ్డుకుంటే అంతు చూస్తామంటూ బెదిరించారు. పొక్లెన్‌తో కల్వర్టుకు రెండు వైపులా ఉన్న గోడలను ధ్వంసం చేశారు. కల్వర్టరు తొలగిస్తే అపార్టుమెంట్‌లో ఉంటున్న 57 కుటుంబాలు రాకపోకలు సాగించడం కష్టమని అపార్టుమెంట్ వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు నెహ్రూ అనుచరులు వెనుక్కు తగ్గారు.
అంతర్గత విభేదాలే కారణమా?
నెహ్రూ టీడీపీలో చేరకముందు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. నెహ్రూ టీడీపీలో చేరాక ఆ ఇంటర్వ్యూ వీడియో ఫేస్‌బుక్, వాట్సప్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను వపన్ క్లాసిక్ అపార్టుమెంట్ బిల్డరు ఫేస్‌బుక్‌లో షేర్ చేసి కామెంట్ పెట్టడంతో కల్వర్టు ధ్వంసానికి నెహ్రూ అనుచరులు ప్రయత్నించారన్న ప్రచారం జరుగుతోంది. తమ నేత టీడీపీలో చేరిన తరువాత అపార్టుమెంట్ ఎదురుగా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్ ఏర్పాటు చేయాలని నెహ్రూ అనుచరులు బిల్డర్‌కు హుకుం జారీచేసినా అతను నిర్లక్ష చేశారన్న ప్రచారం జరుగుతోంది. అపార్టుమెంట్ నిర్మించేటప్పుడు బిల్డర్‌ను నెహ్రూ డబ్బు డిమాండ్ చేశారని, అయితే డబ్బు ఇవ్వనందున ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరి కొందరు విమర్శిస్తున్నారు.
చంద్రబాబుకు ఫిర్యాదుచేస్తా : ఎమ్మెల్యే వంశీ
తన నియోజకవర్గంలో నెహ్రూ వర్గం చేసిన అరాచకాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ శనివారం ఎనికేపాడు వచ్చి అపార్టుమెంట్‌వాసులతో మాట్లాడారు. అంతర్గత విభేదాల కారణంగానే నెహ్రూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు.
లారీ డ్రైవర్లే కూల్చారు : అన్నే చిట్టిబాబు
ఈ ప్రాంతంలో నెహ్రూకు సొంత గోదాములు ఉన్నాయని నెహ్రూ అనుచరుడు, కానూరు మాజీ సర్పంచి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు) పేర్కొన్నారు. వాటి వద్దకు లారీలు వెళ్లకుండా అపార్టుమెంట్ వాసులు, బిల్డరు తమ కార్లు అడ్డంగా నిలిపి దారి ఇవ్వడం లేదన్నారు. ఈ రోడ్డును నెహ్రూ రూ.1.50 కోట్లతో అభివృద్ధిచేశారని పేర్కొన్నారు. దారికి కార్లు అడ్డుపెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా విననందునే నివిసిగిపోయిన లారీ డ్రైవర్లు కల్వర్టును ధ్వంసం చేశారని చెప్పారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణంపై సీఆర్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.