కొత్త జిల్లాకు కొత్త స్టేషన్లు
- ఎస్పీ షానవాజ్ ఖాసీం
- ఎమ్మెల్యే జలగంతో ఎస్పీ భేటీ
పాల్వంచ:కొత్తగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా లో కొత్తగా ఆరు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఎస్పీ షానవాజ్ ఖాసీం చెప్పారు. పాల్వంచ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష్మిదేవిపల్లి, చుంచుపల్లి, మహిళ, సీసీఎస్ (సిటీ క్రైం స్టేషన్), పాల్వంచ టూ టౌన్, ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని వివరించారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్‌ను కిన్నెరసాని స్టేషన్‌గా పేరు మార్చి అక్కడికి తరలిస్తామన్నారు. కొత్త జిల్లా లో పోలీస్ శాఖకు కల్పించాల్సిన ప్రాథమిక, మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలను డీజీపీకి పంపుతామన్నారు. అన్ని ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారిం చామన్నారు. ‘‘చోరీల నివారణ, దొంగల గుర్తిం పు కోసమే కాదు. పోలీస్ సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు; ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు జరుగుతున్న సమయంలో వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో గమనించేందుకు.. పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయి’’ అని వివరించారు. తాగుబోతుల వీరంగం, ఈవ్ టీజింగ్, స్పీడ్ డ్రైవింగ్, అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ తదితరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయన్నారు. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు సత్ఫలితాలిస్తున్నదని అన్నారు. సమావేశంలో ఓఎస్డీ భాస్కర్, డీఎస్పీ సురేంద్ర రావు, సీఐ షుకూర్, ఎస్‌ఐలు పి.సత్యనారాయణ రెడ్డి, బి.సత్యనారాయణ, కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: కొత్త జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై శనివారం స్థానిక ఇల్లెందు అతిధి గృహంలో ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో ఎస్పీ షానవాజ్ ఖాసీం సమావేశమయ్యారు. కొత్త జిల్లాల సరిహద్దులు, ప్రస్తుత పోలీస్ స్టేషన్లు, సర్కిల్స్‌పై చర్చించారు. టూరిజం హబ్‌గా కిన్నెరసాని అభివృద్ధవుతున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని; పోలీస్ శాఖకు ప్రస్తుతమున్న సిబ్బంది, ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించాలని ఎస్పీకి జలగం సూచించారు. పోలీసు శాఖకు కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని కూడా ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ బి.సురేందర్‌రావు పాల్గొన్నారు.