ముక్కలపై ఉప్పెన | Agitation on new districts | Sakshi
Sakshi News home page

ముక్కలపై ఉప్పెన

Published Tue, Oct 4 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు

కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు

  • భద్రాచలం కోసం ఆఖరి పోరాటం
  • నేడు డివిజన్‌ బంద్‌కు పిలుపు
  • అఖిలపక్షం అత్యవసర సమావేశం
  • భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ 
  • సీపీఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం 
  • ఏజెన్సీ బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య
  • భద్రాచలం : 
    భద్రాచలం పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, వర్తక, వాణిజ్య సంఘాలన్నీ ఏకమైయ్యాయి. మంగళవారం భద్రాచలంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కమిటీ నాయకులు రావుల పల్లి రాంప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ లతో పాటు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు హాజరయ్యారు. నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు పాలకుల తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో భద్రాచలం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. నాడు నాలుగు మండలాలు, నేడు రెండు మండలాలు పోతే ఇక భద్రాచలం డివిజన్‌లో మిగిలేవి మూడేనని, ఇది భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. దీనిపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. బుధవారం భద్రాచలం బంద్‌కు పిలుపునిస్తున్నట్లుగా ప్రకటించారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజానీకం మద్దతు తెలుపాలని వారు కోరారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కడియం రామాచారి, గంటా కృష్ణ, టీడీపీకి చెందిన కొమరం ఫణీశ్వరమ్మ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, బీజేపీ నాయకులు ఆవుల సుబ్బారావు, నాగబాబు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు కంభంపాటి సురేష్, చారుగుళ్ల శ్రీనివాస్, టీవీ, నరేష్‌, సుబ్బారావు, ఉపేంద్రవాసు, దేశప్ప, సురేష్‌నాయుడు,, కృష్ణ, సాయి, రాజు పాల్గొన్నారు. 
    కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
    వాజేడు, వెంకటాపురం మండలాలను కొత్తగూడెం జిల్లాలో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో  పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో మంగళవారం సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎం కేసీఆర్‌ ఏకపక్షంగా వ్యవహరించటం సరైంది కాదని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌ అన్నారు. ఖమ్మంలో భద్రాచలంను మూడో జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నర్సారెడ్డి, నూకరత్నం, శ్రీను, కృష్ణార్జునరావు, రాఘవయ్య, కొండలరావు, ముక్తేశ్వరి, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
    భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే రాజయ్య, ఎన్డీ నేత కెచ్చెల రంగారెడ్డి
    భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం చేపట్టిన బంద్‌లో భాగంగా భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌లో ధర్నా చేశారు. ఆదివాసీ ప్రాంతాలను విచ్ఛిన్నం చేయాలని పాలకులు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే రాజయ్య ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భద్రాచలం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు.  ఆదివాసీ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, భవిష్యత్‌లో మనుగడ ప్రశ్నార్థకం కాబోతుందని న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలను  ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీల స్వయం పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో కెచ్చెల కల్పన, ప్రసాద్, జోగారావు, ప్రమోద్, జీఎస్పీ నుంచి చలపతి, ప్రకాష్, సత్యనారాయణ, కొండరెడ్ల సంఘం నాయకులు ముర్ల రమేష్‌  పాల్గొన్నారు. 
    కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement