- కొత్త జిల్లాలపై అభ్యంతరాలు
- స్వీకరణకు నేటితో గడువు సరి
- తుది ప్రకటనపై అందరి ఆసక్తి
- అందిన వినతులు 1,670
- ఆన్‌లైన్‌లో వచ్చినవి 760
- ‘మెదక్ జిల్లా’పైనే అత్యధికం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం, అభ్యంతరాలు, సలహాల స్వీకరణ గడువు మంగళవారంతో ముగియనుంది. మెదక్ జిల్లాను విభజించి కొత్తగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం గత నెల 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 30 రోజులలోపు ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలు, సలహాలను అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది.
జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్‌ను అనుసరించి మంగళవారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రకటించే తుది ముసాయిదా (డ్రాప్టు ప్రకటన) ఎలా ఉంటుందోనని, ఎప్పుడు ప్రకటిస్తారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ, కొత్త మండలాల ఏర్పాటపై సోమవారం వరకు అధికారులకు మొత్తం 1,670 వినతులు, అభ్యంతరాలు అందాయి. వీటిలో 910 వినతులు, అభ్యంతరాలు నేరుగా అధికారులకు అందగా 760 ఆన్‌లైన్‌లో వచ్చాయి.
ఏ జిల్లాలో ఎన్ని అభ్యంతరాలు?
మెదక్ జిల్లా ఏర్పాటుకు సంబంధించి 98, సంగారెడ్డి జిల్లా ఏర్పాటుకు సంబంధించి 143, సిద్దిపేట జిల్లాకు సంబంధించి 19 అభ్యంతరాలు, వినతులు అందాయి. అలాగే ప్రతిపాదిత మెదక్ జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 201, మండలాల ఏర్పాటుపై 549 వినతులు, అభ్యంతరాలు వివిధ వర్గాల వారు అధికారులకు అందజేశారు.
సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 259, మండలాల ఏర్పాటుపై 139 అభ్యంతరాలు, వినతులు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో రెవెన్యూ డివిజన్లపై 93, మండలాల ఏర్పాటుపై 169 వినతులు, అభ్యంతరాలు అధికారులకు అందజేశారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, వినతులు అందజేసేందుకు మంగళవారం తుది రోజు కావటంతో అధికారులకు మరిన్ని వినతులు అందే అవకాశం ఉంది.
ఇదీ లెక్క
జిల్లా వినతులు
మెదక్ 848
సంగారెడ్డి 541
సిద్దిపేట 281
===============
మొత్తం 1,670
===============