కొత్త నోటు.. ఇట్టే పట్టు! | new notes.. easy pick | Sakshi
Sakshi News home page

కొత్త నోటు.. ఇట్టే పట్టు!

Published Tue, Dec 6 2016 11:27 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

కొత్త నోటు.. ఇట్టే పట్టు! - Sakshi

కొత్త నోటు.. ఇట్టే పట్టు!

డోర్‌ డెలివరీ వ్యాపారం
– 10 శాతం కమీషన్‌ ఇస్తే చాలు
– చర్చనీయాంశంగా మారిన ముఠా ఆగడాలు
– భారీ మొత్తంలో కొత్త కరెన్సీ సర్క్యులేషన్‌
– మొదట్లో ఏకంగా 30 శాతం కమీషన్‌
 
రూ.500 మించి మందులు(మెడిసిన్స్‌) కొనుగోలు చేస్తే మీ ఇంటికే పంపుతాం. – ఓ మెడికల్‌ షాప్‌ ప్రకటన
మీరు రూ.2 వేలకు మించి సరుకులు కొనుగోలు చేస్తే మీ ఇంటి వద్దకే సరుకులు తెచ్చిస్తాం. ఇవీ మార్కెట్‌లో సాధారణంగా కనిపించే వ్యాపార ప్రకటనలు. తాజాగా రూ.1.10లక్షల పాత కరెన్సీ ఇస్తే.. లక్ష రూపాయల కొత్త కరెన్సీ డోర్‌ డెలివరీ చేస్తాం అంటూ ఓ ముఠా ప్రచారం చేసుకుంటోంది.
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కొత్త కరెన్సీ రాకతో రోజుకో కొత్త తరహా వ్యాపారం తెరపైకి వస్తోంది. బ్లాక్‌ మనీని మార్చుకోవడం ఎంత సులువైన విషయమో రోజుకో కొత్త ప్రచారం చూస్తే అర్థమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్ని లక్షలు కావాలన్నా చెప్పండి.. మీ ఇంటి వద్దకే వచ్చి కరెన్సీ ఇస్తామంటూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎలాంటి తనిఖీల ఇబ్బంది లేకుండా కొత్తగా నిగనిగలాడే రూ.2వేల నోట్లు ఇస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవైపు రూ.2వేలకే గంటలకొద్దీ లైన్లలో వేచి చూస్తున్న సాధారణ జనం.. మరోవైపు లక్షలకు లక్షల కొత్త కరెన్సీని ఇంత సులభంగా కరెన్సీ ముఠా ఎలా తేగలుగుతుందో అర్థం కాని పరిస్థితి. మొదట్లో 30 శాతం వరకూ ఉన్న కమీషన్‌ కాస్తా తాజాగా 10 శాతానికి పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 8 శాతం కమిషన్‌తోనూ నల్లధనాన్ని సులభంగా తెల్లధనం చేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. కరెన్సీ మార్పిడి పేరుతో నకిలీ ముఠాలు కూడా జిల్లాలో సంచరిస్తున్నాయి. డబ్బున్న వాళ్లను గుర్తించి దోచుకునేందుకు కొత్త ఎత్తుగడతో తెరపైకి వస్తున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
 
ఒకవైపు క్యూలు.. మరోవైపు...!
– ఒకవైపు కేవలం రూ.2 వేల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏటీఎంలో వేచిచూస్తున్న సాధారణ జనం!
– వచ్చిన జీతాన్ని తీసుకునేందుకు బ్యాంకు వద్ద క్యూలో ఉదయం నుంచి నిల్చుంటే కేవలం రూ.4 వేలు మాత్రమే ఇస్తామని చల్లగా మధ్యాహ్నం సమయంలో తేల్చిచెబుతున్న బ్యాంకర్లు!!
– మరోవైపు లక్షా 10 వేలు ఇవ్వండి చాలు.. అక్షరాలా లక్ష రూపాయల కొత్త రూ.2 వేల నోట్ల కరెన్సీ ఇస్తామంటున్న ఏజెంట్లు!!!
ఇదీ జిల్లాలో హెచ్చుమీరుతున్న కరెన్సీ ముఠా ఆగడాలకు సాక్ష్యం. అది కూడా నేరుగా ఇంటికే చేరుస్తామని(డోర్‌ డెలివరీ) కూడా చెబుతుండటం గమనార్హం. బ్యాంకుల చుట్టూ గంటలకు గంటలు తిరిగితే తప్ప రూ.2 వేలు సాధారణ జనం పొందలేకపోతుంటే...లక్షలకు లక్షలు కొత్త కరెన్సీ ఏ విధంగా కరెన్సీ ముఠా చేతికి వచ్చిందనే విషయం అర్థం కాని పరిస్థితి. అయితే, బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా ఇంత సులభంగా కొత్త కరెన్సీ మార్కెట్‌లో లభించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో బ్యాంకు సిబ్బంది పాత్రపై విచారణ జరిగితే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే, ప్రధానంగా బళ్లారి నుంచి భారీగా కొత్త నగదు జిల్లాలోకి వచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది.
 
30 శాతం నుంచి 8 శాతానికి..
వాస్తవానికి నోట్ల రద్దు ప్రకటన కొత్తలో ఏకంగా 30 శాతం కమీషన్‌ నడిచింది. అంటే పాత నోట్ల మొత్తం లక్ష రూపాయలు ఇస్తే.. రూ.70 వేల కొత్త కరెన్సీ ఇచ్చేవారు. అయితే, రానురాను సులభంగా కొత్త కరెన్సీ ముఠాకు వచ్చిపడుతోంది. దీంతో క్రమంగా కమీషన్‌ మొత్తాన్ని 30 నుంచి 20 శాతానికి.. ఆ తర్వాత 15 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 10 శాతం కమీషన్‌ నడుస్తోందని సమాచారం. ఇంకా బేరమాడితే 8 శాతానికి కూడా నగదును సులభంగా ఈ ముఠాలు మారుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇదే అదనుగా కరెన్సీ మారుస్తామంటూ నకిలీ ముఠాలు తెరమీదకు వస్తున్నాయి.
 
నిరంతరం దాడులు చేస్తాం
కరెన్సీ మారుస్తామంటూ కొన్ని ముఠాలు జిల్లాలో బయలుదేరాయి. జిల్లా అంతటా ఇప్పటికే అప్రమత్తం చేశాం. అందుకే ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు చెబుతున్నాం. కరెన్సీ ముఠాల గురించి పోలీసులకు సమాచారం ఇస్తాం. నకిలీ ముఠాలు కూడా బయలుదేరాయి. ఆదోని గ్యాంగు వద్ద కూడా నగదు లేదు. కేవలం రూమర్లను సృష్టించి.. డబ్బున్న వాళ్లను గుర్తిస్తున్నారు.
– ఆకే రవికృష్ణ, జిల్లా సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement