ఆన్..లైన్!
►కొత్త పాలసీ.. పాత నిర్ణయం!
►మూడేళ్లుగా సాగుతున్న కసరత్తు
►అమల్లోకి రాని ఆన్‌లైన్ బిల్లింగ్
►అద్దె ప్రాతిపదికన కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ కార్వే సంస్థతో ఒప్పందం
►ఈ నెల 25 తుది గడువు
►ఎప్పటిలానే వ్యాపారుల ససేమిరా
►వంతపాడుతున్న అధికారులు
ఆన్‌లైన్ బిల్లింగ్‌తో సిండి‘కేట్ల’కు అడ్డుకట్ట వేయాలనే అబ్కారీ శాఖ ఆలోచనకు ఎప్పటికప్పుడు కళ్లెం పడుతోంది. ఎమ్మార్పీకే మద్యం విక్రయించేలా చర్యలు చేపట్టి మందుబాబుల జేబుకు కాస్త ఊరటనివ్వాలనే ఈ నిర్ణయం వ్యాపారులకు మింగుడుపడటం లేదు. ఈ విషయంలో అధికారులకు చిత్తశుద్ధి కొరవడటం కూడా అమలులో వెనుకబాటుకు కారణంగా తెలుస్తోంది. రెండు నెలల కిందట కొత్త పాలసీ అమల్లోకి రావడం.. దుకాణాలు కొత్త వ్యాపారుల చేతుల్లోకి వెళ్లడంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.
మద్యం అమ్మకాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ 2015లో ఆన్‌లైన్ బిల్లింగ్‌కు శ్రీకారం చుట్టింది. నకిలీ మద్యం నివారణ.. అమ్మకాల్లో పారదర్శకత లక్ష్యమని అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. నకిలీ లేబుళ్లతో నాసిరకం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. అక్కడ మద్యం ధరలు తక్కువ కావడం.. పైగా ట్యాక్స్ వెసలుబాటు ఉండటంతో వ్యాపారులు ఆ దిశగా దందా సాగిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కొత్త విధానంతో వీరికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
ఇకపోతే నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాలు కలుపుతుండటంతో మందుబాబులు అనారోగ్యం పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హోలోగ్రాం విధానం అమలైతే మద్యం సీసాలపై ఉండే నెంబర్ ఆధారంగా అది ఎక్కడ తయారైందనే విషయం స్పష్టమవుతుంది. ఫలితంగా నకిలీ మద్యం ప్రవాహాన్ని నిలువరించే వీలుంటుంది. జిల్లాలో ప్రస్తుతం ప్రతినెలా రూ.50కోట్ల మద్యం విక్రయిస్తున్నారు. కొత్త విధానం అమలైతే మద్యం మాఫియా ఆగడాలకు బ్రేక్ పడటంతో పాటు ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆన్‌లైన్‌కు వ్యాపారులు ససేమిరా
ఆన్‌లైన్ బిల్లింగ్ విషయమై మూడేళ్ల క్రితం కార్వే సంస్థ ఒప్పందం చేసుకుంది. వ్యాపారులు కంప్యూటర్లు కొనుగోలు చేసినా.. లేదంటే అద్దెకైనా పరికరాలను అమరుస్తామని కార్వే ముందుకొచ్చింది. బిల్లింగ్ అమలైతే మద్యం సిండికేట్‌కు అవకాశం ఉండదు. దీంతో వ్యాపారులు ఈ విధానాన్ని తిరస్కరించారు. అబ్కారీ అధికారులు కూడా అదనపు ఆదాయం కోల్పోతామనే భావనతో లోలోపల బిల్లింగ్‌కు వ్యతిరేకంగా పని చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా మూడేళ్ల నుంచి ఈ అంశానికి బ్రేక్ పడుతూ వస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం ఈ ఏడాది ఎలాగైనా దీన్ని అమలు చేయాలని పట్టుబట్టారు. ఈ నెల 25లోపు అన్ని దుకాణాల్లో కంప్యూటర్లు అమర్చుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే వ్యాపారులు, స్థానిక అబ్కారీ అధికారులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ సిండికేట్‌కు రంగం సిద్ధం
ఎప్పటిలాగే ఆన్‌లైన్‌బిల్లింగ్‌ను అడ్డుకోగలిగితే వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి ‘వయోలేషన్’(ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయాలు సాగించడం) చేసే యోచనలో వ్యాపారులు ఉన్నారు. దీనికి కొందరు అధికారులు కూడా మద్దతుగా ఉన్నట్లు సమాచారం. వయోలేషన్‌తో ప్రతినెలా జిల్లాలోని వ్యాపారులకు రూ.4.5కోట్ల నుంచి రూ.13కోట్ల వరకు అదనంగా ఆదాయం సమకూరుతుంది. ఈ డబ్బులో ఎక్సైజ్ అధికారులతో పాటు సివిల్ పోలీసులకు వాటా ఉంటుందనే బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ‘ఆన్‌లైన్’ పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చి వచ్చే నెలలో సిండికేట్ కావాలనే యోచనలో వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది.
అద్దె ముసుగులో దోపిడీ
ఆన్‌లైన్ విధానంలో ‘కార్వే’కు భారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 240 మద్యం దుకాణలు ఉండగా.. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ కార్వే అమరుస్తుంది. నెలకు రూ.5వేలు అద్దె వసూలు చేస్తారు. వ్యాపారులు కొనుగోలు చేస్తే రూ.30వేల లోపు మొత్తం పరికరాలు వస్తాయి. గడువు ముగిసిన తర్వాత కంప్యూటర్ వ్యాపారికి మిగులుతుంది. కానీ కార్వేకు నెలకు రూ.5వేలు చొప్పున ఏడాదికి రూ. 60వేలు చెల్లించాలి. ఈ లెక్కన రూ.14.40కోట్లు కార్వేకు ముడుతుంది. కొత్తపాలసీ దక్కించుకునే వారికి తిరిగి ఈ కంప్యూటర్లనే అమరుస్తారు. అంటే అద్దె పేరుతో భారీగా దండుకోవడమే లక్ష్యంగా కన్పిస్తోంది.
కంప్యూటర్ బిల్లింగ్.. హోలోగ్రాం
► yes ప్రతి మద్యం దుకాణంలో ఆన్‌లైన్ కంప్యూటర్ బిల్లులు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పాటు చేస్తారు.
►yes సూపర్‌మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేసి, బిల్లు ప్రతిని కొనుగోలుదారునికి అందజేస్తారు. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఎక్సైజ్ కమిషనరేట్‌కు చేరుతుంటాయి.
►yes అలాగే ప్రతి మద్యం సీసాపై హోల్‌గ్రాం ఉంటుంది. దీనిపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్‌కు సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు.
► yes బాటిల్‌పై ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ముద్రిస్తారు.
►yes మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్‌ఎంఎస్ పంపితే చాలు, క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు? ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మకం జరిగింది? అనే వివరాలు అతనికి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి.