తుని ఘటనలో అరెస్ట్ చేసినవారిపై ముద్రగడ పద్మనాభం చెప్పినంత మాత్రాన కేసులు ఉపసంహరించుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
రాజమండ్రి: తుని ఘటనలో అరెస్ట్ చేసినవారిపై ముద్రగడ పద్మనాభం చెప్పినంత మాత్రాన కేసులు ఉపసంహరించుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ముద్రగడ డిమాండ్లకు తలొగ్గేది లేదని, ఇంకా అరెస్టులు జరుగుతున్నాయన్నారు. కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన ఏడుగురు రౌడీషీటర్లేనని, ప్రత్యక్ష నేరచరిత్ర ఉన్నవారినే అరెస్ట్ చేసినట్లు చినరాజప్ప తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉందని తేలితే ముద్రగడ మీద కూడా కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా గడువులోగా కాపులను బీసీల్లోకి చేర్చుతామన్నారు.
కాగా తుని సంఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు అరెస్టులు ప్రారంభించడంతో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం లోగా కేసులు ఉపసంహరించుకోకపోతే ఈనెల 9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.