
ఫారెస్ట్!
♦ పరిశోధనలకు మంగళం
♦ మొక్కల పెంపకానికే పరిమితం
♦ చతికిల పడ్డ అటవీ పరిశోధనా కేంద్రం
♦ నాడు రాష్ట్రానికే తలమానికం
♦ నేడు వెలవెలబోతున్న వైనం
అటవీ పరిశోధనా కేంద్రం వెలవెలబోతున్నది. అంతరించిపోతున్న అడవిని అభివృద్ధి చేస్తూ.. కొత్త తరహా పరిశోధనలకు కేంద్ర బిందువై రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన ఈ కేంద్రం నేడు చతికిలపడింది. ల్యాబ్‌లు, ఎన్నో సౌకర్యాలతో ఏర్పాటు చేసిన భవనాలు శిథిలమయ్యాయి. సిబ్బంది సంఖ్యను కుదించారు. కేవలం మొక్కల ఉత్పత్తికే పరిమితమైంది. గతేడాది ఇదే ప్రాంగణంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫారెస్ట్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాలకు సంబంధించి తరగతులను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా దూలపల్లి అటవీ శాఖ అకాడమీలో ప్రారంభమయ్యాయి. కానీ అటవీ పరిశోధన కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
గజ్వేల్/ములుగు : అంతరించిపోతున్న అడవి జాతి మొక్కల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన అటవీ పరిశోధనా కేంద్రం మూలనపడింది. నాడు సకల సౌకర్యాలు, సరిపడా సిబ్బంది ఉన్న ఈ కేంద్రం.. ప్రస్తుతం మొక్కల ఉత్పత్తికే పరిమితమైంది. గత ఏడాది ప్రారంభమైన ఫారెస్ట్రీ కాలేజీ సైతం దాదాపుగా మరో చోటుకి తరలిపోయింది. నాటి వైభవాన్ని తీసుకొస్తామని అధికారులు చెబుతున్నా.. ప్రణాళికలు ఇంకా పేపర్లలో మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో అటవీ పరిశోధన కేంద్రంపై ఁసాక్షి* ప్రత్యేక కథనం. మూడు దశాబ్ధాల క్రితం ములుగు మండల కేంద్రంలో అటవీ పరిశోధనా కేంద్రం ఏర్పాటైంది.
రంగారెడ్డి జిల్లా దూలపల్లి, వరంగల్ జిల్లా ములుగు ప్రాంతాల్లో సైతం ఇలాంటి కేంద్రాలున్నాయి. అంతరించిపోతున్న అడవి జాతి మొక్కలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయడం, అంటుకట్టు విధానంలో కొత్త వంగడాలు సృష్టించడం, ఔషధ మొక్కలను ఉత్పత్తి చేయడం ప్రధానంగా ఈ కేంద్రం ఉద్దేశం. సుమారు 200 హెక్టార్లలో ఈ కేంద్రం పరిశోధనలు సాగేవి. ఇందుకోసం శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లను నియమించారు. అన్ని రకాల వసతులతో ల్యాబ్ కూడా నిర్మించారు. ఏళ్ల తరబడి ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ఏటా సుమారు వందకు పైగా ఔషధ మొక్కలు ఉత్పత్తి చేసేవారు.
మరోవైపు ఎప్పటికప్పుడు కొత్తరకం వంగడాలు సుమారుగా పదికిపైగా తీసుకువచ్చేవారు. అయితే, అనూహ్యంగా పదేళ్లుగా ఈ కేంద్రం చతికిలపడింది. శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్ల కార్యకలాపాలు కూడా ఇక్కడ సాగడంలేదు. ల్యాబ్ మూతపడింది. పరిశోధనలకు ఉపయోగించే పరికరాలన్నీ తుప్పుపట్టాయి. ప్రస్తుతం ఇద్దరు సెక్షన్ అధికారులు, ఒక బీట్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. ఈ కేంద్రం మొక్కల ఉత్పత్తికి మాత్రమే పరిమితమైంది.
మొక్కల పెంపకం ఇలా...
ప్రస్తుతం ఈ కేంద్రంలో అటవీజాతి మొక్కలు మలబారు వేప, సిల్వర్ ఓక్, తాని, వేప, రోజ్‌వుడ్, నిరుద్ధి, తెల్ల దర్శనం, ఆరే, నెమలినారే, తప్సి, చెన్నంగి, కర్జూర, నల్లమద్ది, తెల్లమద్ది, తబూబియాహోలెండ్, నారవేప, తబూబియాఆర్య, ప్రతోడియా, మారేడు, గుల్మోర్, ఏడాకులపాల, మహాగని, చైనా బాదాం, ఉసిరి, రేవ్‌సండల్, రావి, మర్రి, జివ్వి, ఇప్ప, మిత్రగైన, రక్తకాండ, నేరేడు, మొర్రి, సీమరువ, బహువీనియా, పెద్దమాను తదితర మొక్కలను ఏటా 5 నుంచి 10లక్షల మేర ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా రకాల మొక్కల విత్తనాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ముందుగా ప్రైమరీబెడ్లలో నాటుతారు. ఈ బెడ్లలో ఏకకాలంలో కొన్ని లక్షల మొక్కలను విత్తుకునే అవకాశమున్నది. ఇసుకవేసి ఉన్న ఈ బెడ్లలో మొలకలు రాగానే వాటిని రూట్ ట్రేనర్స్‌లోకి మారుస్తారు.
రూట్ ట్రేనర్‌లో కొబ్బరిపొట్టు ఎరువు, వర్మికంపోస్టు ఎరువును వేసి వాటిని కొద్దిరోజులు వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే టన్నెల్స్(పాలీగ్లోబల్స్)లో ఉంచుతారు. సుమారు 10 రోజుల వరకు ఇందులోనే మొలకలు ఉంటాయి. ఆ పది రోజుల్లో వేరు వ్యవస్థ బలపడుతుంది. ఆ తరువాత వీటిని గ్రీన్‌హౌస్‌లోకి మారుస్తారు. సుమారు 45రోజుల పాటు గ్రీన్‌హౌస్‌లో ఉంచిన తరువాత మొక్క ఎదుగుతుంది. కొన్ని మొక్కలను పాలీహౌస్‌లలోనూ పెంచుతారు. ఆ తరువాత పాలిథిన్ కవర్లలోకి మొక్కలను మార్చి పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తారు. ఈ విధంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కలను నాటడానికి పంపుతారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అటవీ పరిశోధన కేంద్రంలో నీలగిరి వనం 20 హెక్టార్లు, టేకు 20 హెక్టార్లు, రోజ్‌వుడ్ 3హెక్టార్లు, పెద్దమాను 3 హెక్టార్లు, మారేడు, మిత్రగైన, నారవేప, మరో రెండు రకాల చెట్లు ఒక్కో హెక్టారు చొప్పున విస్తరించి ఉన్నాయి.
పరిశోధనా కేంద్రం అభివృద్ధికి కార్యాచరణ
ములుగులోని అటవీ పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు నిలిచిపోయిన మాట వాస్తవమే. ఈ కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంలో ‘హరితహారం’ ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నారు. ఫారెస్ట్రీ కళాశాలకు స్థలం కేటాయింపు, భవనాల నిర్మాణం ప్రారంభం కాగానే పరిశోధనా కేంద్రం వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశమున్నది. ఈ కేంద్రాన్ని గతంలో మాదిరిగానే రాష్ట్రంలోనే అగ్రగామి పరిశోధనా స్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఫారెస్ట్రీ కళాశాల ఇక్కడే...
ఈ అటవీ పరిశోధన కేంద్రం ప్రాంగణంలో కొత్తగా నిర్మించబోతున్న ఫారెస్ట్రీ కళాశాల కూడా దక్షిణ భారత దేశంలోనే రెండో సంస్థగా ఖ్యాతి పొందుతున్నది. ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటుకు గతేడాది నుంచే కార్యాచరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇలాంటి సంస్థ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ ప్రాంతంలో గల మెట్టుపాలెంలో ఉంది. ములుగులో ఏర్పాటు చేయనున్న సంస్థ కూడా అదేస్థాయి ప్రమాణాలను కలిగివుంటుంది. ప్రస్తుతం ఈ కళాశాలకు సంబంధించిన తరగతులు ఇక్కడ సొంత భవనం అందుబాటులో లేక ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా దూలపల్లిలోని అటవీ పరిశోధనా కేంద్రంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న భూమిలో ఫారెస్ట్రీ కళాశాలకు ఎంత కేటాయించాలి? అనే విషయంలో స్పష్టత రాలేదు. దీని తర్వాతే పరిశోధనా కేంద్రం అభివృద్ధి విషయంపై కార్యాచరణ ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది.