నో ఫాగింగ్
-
పెరిగిన దోమల బెడద
-
పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు
-
కుంటలను తలపిస్తున్న ఖాళీ స్థలాలు
-
పట్టించుకోని పంచాయతీ అధికారులు
ఇచ్చోడ : అసలే వర్షాకాలం. ఆపై నెల నుంచి ముసురు. వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో జనం రోగాల బారిన పడుతున్నారు.
ఇచ్చోడ మండల కేంద్రంలోని పలు కాలనీల్లో ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి కుంటలను తలపిస్తున్నాయి. ఇందులో పందులు, కుక్కలు సంచరించడంతో కాలనీలో విపరితమైన దోమలు, ఈగలు వద్ధి చెందుతున్నాయి. దీంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు నీరు నిలిచే చోట బయటకు పంపే ఏర్పాటు చేయడం లేదు.
దీంతో ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి ఉండడం..అందులోనే చెత్తాచెదారం పడేయడంతో కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇళ్ల మధ్యనే కుంటల్లాగా నీరు నిలిచి ఉండడంతో పందులు బొర్లుతున్నాయి. దోమలు వద్ధి చెందుతున్నాయి. దీంతో చుట్టు పక్కల ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. మలేరియా, డెంగీ, కలరా తదితర వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు.
కనిపించని ఫాగింగ్
వర్షాకాలంలో మండల కేంద్రంలో ప్రతీ చోట ఫాగింగ్ చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు పంచాయతీ అధికారులు ఫాగింగ్ చేయలేదు. ఫాగింగ్ చేస్తే దోమలు చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ మేజర్ పంచాయతీ పరిధిలోని కేవలం రెండు కాలనీలో మాత్రమే ఫాగింగ్ చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతీ కాలనీలో ఫాగింగ్ చే సి దోమల నిర్మూలన కోసం కృషి చేయాలని కోరుతున్నారు.