‘పోస్టర్‌’ గాలింపు..అదో తంతు.. | no results from poster releases by police | Sakshi
Sakshi News home page

‘పోస్టర్‌’ గాలింపు..అదో తంతు..

Published Tue, Aug 16 2016 8:56 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

పోలీసుల వద్దనున్న నయీమ్‌ పాత ఫొటో, ఎన్‌కౌంటరుకు కొన్ని రోజుల ముందు ఇలా.. - Sakshi

పోలీసుల వద్దనున్న నయీమ్‌ పాత ఫొటో, ఎన్‌కౌంటరుకు కొన్ని రోజుల ముందు ఇలా..

సాక్షి, సిటీబ్యూరో: మనకు బాగా పరిచయమైన వ్యక్తినే కొన్నేళ్ల తర్వాత చూస్తే గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో అతనెవరో గుర్తించడం కూడా కష్టమే. అలాంటిది ఓ వ్యక్తికి సంబంధించిన కొన్నేళ్ల క్రితం నాటి ఫొటో ఆధారంగా ఇప్పుడు అతడిని పట్టుకోవడం సాధ్యమేనా..? కచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. ఇదే విషయాన్ని నయీం ఉదంతమూ స్పష్టం చేసింది. వీటి ఆధారంగా వీవీఐపీల పర్యటన సమయంలో నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు వేసే ‘పోస్టర్లు’ చెప్పుకోవడానికే గాని పట్టుకోవడానికి కాదని తేలిపోతోంది.

ప్రధాని వచ్చినప్పుడూ అదే తంతు..
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 7న రాష్ట్రానికి వచ్చారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అత్యంత ముప్పు పొంచి ఉన్న వీవీఐపీగా పరిగణించే ప్రధాని పర్యటనకు పోలీసులు పటిష్ట బం దోబస్తు ఏర్పాటు చేశారు. సభ/సమావేశ ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అడుగడుగూ జల్లెడ పట్టారు. దీనికి తోడు మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు, మావోయిస్టుల ఫొటోలతో అందరినీ పోల్చిచూసే ప్రయత్నం చేస్తారు. ఒక్క ఎల్బీ స్టేడియం వద్దే కాదు.. దేశ వ్యాప్తంగా ఎక్కడ మోడీ టూర్‌ జరిగినా ఇదో తంతుగా మారిపోయింది.

ఫొటోలను ఇలా సేకరించి..
‘వాంటెడ్‌’ జాబితాలో ఉన్న వ్యక్తుల ఫొటోలు సేకరిం చేందుకు పోలీసులు అనేక మార్గాలు అన్వేషిస్తుంటారు. ఆయా వ్యక్తులు గతంలో ఏదైనా కేసులో అరెస్టయి ఉంటే ఇబ్బంది లేదు. పోలీసు రికార్డుల నుంచి వాటిని తేలిగ్గా తీసుకోవచ్చు. అలా కానప్పడు వారి బంధువులు, పరిచయస్తుల ద్వారా సేకరిస్తారు. ఇది సాధ్యం కాకపోతే ప్రభుత్వ రికార్డులు, అనేక సందర్భాల్లో వారు విద్యనభ్యసించిన స్కూలు రికార్డులూ ఆధారమవుతాయి. ఇవన్నీ సదరు నేరగాడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కొన్నేళ్ల క్రితం నాటివే అవుతాయి. అయినప్పటికీ వీటి ఆధారంగానే పోలీసులు వాంటెడ్‌ నోటీసులు జారీ చేయడంతో పాటు రివార్డులు ప్రకటించి గాలింపు చేపడుతుంటారు. ఇలా ఏ మార్గంలోనూ ఫొటో లభించని పక్షంలో ‘స్కెచ్‌’ల ద్వారా కథ నడుపుతారు.

అసాధ్యమని చెప్పిన ‘నయీమ్‌’ ఉదంతం..
పాత ఫొటోల ఆధారంగా చేపట్టే ‘గాలింపు’తో ఫలితాలు ఉండవని గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఉదంతం స్పష్టం చేసింది. ఇతడు ఎన్‌కౌంటర్‌ అయ్యే నాటికి దాదాపు 13 ఏళ్ల క్రితం నాటి అతడి ఫొటోనే పోలీసుల వద్ద ఉంది. అప్పట్లో పోలీసుల ఎదుట లొంగిపోయినప్పుడు సేకరించి రికార్డుల్లో భద్రపరిచారు. దీని ఆధారంగానే ఇన్నాళ్ల పాటు అతడి కోసం పోలీసులు ‘వేటాడారు’. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఫొటో, అతడి డెన్స్‌లో దొరికిన ఫొటోలను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. పాత ఫొటో ఆధారంగా ఎంత గాలించినా నయీమ్‌ వేషం మార్చుకోకున్నా పట్టుకోవడం అసాధ్యమని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలాంటి చర్యలు పోలీసు స్ట్రాటజీలో భాగమని, సదరు పోస్టర్లతో తనిఖీలు జరుగుతున్నట్లు తెలిస్తే ఆయా ముష్కరులు వెనుకడుగు వేసే ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు.

‘మామూలు వాళ్లనూ’ గుర్తించలేం..
ప్రధాని మోడీ సభ నేపథ్యంలో పోలీసులు ముద్రించిన పోస్టర్లను పరిశీలిస్తే.. ఆ సైజులో ఉండే ఫొటోలతో అజ్ఞాతంలో ఉన్న వాంటెడ్‌ వారి విషయం అటుంచితే.. నిత్యం కళ్ల ముందు సంచరించే వారినీ గుర్తించలేమని కొందరు పోలీసులు అంటున్నారు. బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా పోలీసులు చేతుల్లో ఇమిడేలా, రెండు రకాల పోస్టర్లను ముద్రించారు. ఒక దానిపై 37 మంది వాంటెడ్‌ ఉగ్రవాదులు, మరో దానిపై 12 మంది వాంటెడ్‌ మావోయిస్టుల ఫొటోలు ముద్రించారు. ఈ సైజులో ఫొటోలు స్పష్టంగా ఉన్నప్పటికీ కదులుతున్న వారితో పోల్చడం సాధ్యం కాదని తెలుస్తోంది




పోలీసులు విడుదల చేసిన పోస్టరు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement