కొత్త వాహనాలకు నేరుగా పర్మనెంట్ నంబరే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇకపై మీరు కొనుగోలు చేసే కొత్త వాహనానికి నేరుగా శాశ్వత సంఖ్య(పర్మనెంట్ నంబర్) రానుంది. టెంపరరీ(తాత్కాలిక) నంబర్ ఇచ్చే విధానానికి రవాణా శాఖ స్వస్తి పలకనుంది. ఫిబ్రవరి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన సోమవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. వాహనానికి నేరుగా పర్మనెంట్ నంబర్‌ను డీలర్ వద్దే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం వాహనాన్ని 10 కోణాల్లో పొటోలు తీసి రవాణా శాఖకు డీలర్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
అదేవిధంగా ఫిబ్రవరి నుంచి 83 రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ప్రజలు కేవలం లెర్నింగ్, పర్మనెంట్ లెసైన్స్, ఫిట్‌నెస్ టెస్టులకు మాత్రమే రవాణా శాఖ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నా రు. వాహన యజమాని మార్పు మొదలైన అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే పొందే వీలుందని చెప్పారు.
కంప్యూటర్ ద్వారానే డ్రైవింగ్ టెస్ట్ ఫలితం
విజయవాడలో అత్యాధునిక టెస్టింగ్ డ్రైవింగ్ ట్రాక్‌ను సిద్ధం చేశామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ట్రాక్‌లో డ్రైవింగ్ తీరు మొత్తాన్ని సీసీ కెమెరాలో బంధిస్తామని... చివరకు టెస్టు పాసయ్యారో, ఫెయిలయ్యారో కంప్యూటర్ ద్వారానే ఫలితం విడుదల చేస్తామని వెల్లడించారు. లెర్నింగ్ లెసైన్స్ కోసం అత్యాధునిక విధానంలో ఏటీఎం మిషన్ల తరహాలో ఉండే కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మొదట విజయవాడలో ఫిబ్రవరి 1 నుంచి ఈ పరికరాలను ఉపయోగిస్తామన్నారు. అక్కడ విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
జూన్ చివరి నాటికి 40 శాతం పోస్టులు ఖాళీ
రవాణా శాఖలో ప్రస్తుతం 33 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఈ ఏడాది జూన్ చివరినాటికి ఇది 40 శాతానికి చేరుకోనుందని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఖాళీల భర్తీపై త్వరలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీసు కమిషన్ కూడా ఖాళీల వివరాలను కోరిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 8 కొత్త చెక్‌పోస్టులు ఏర్పాటు కావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందిని అక్కడకు తరలించాల్సి వచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,976 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాల్సి ఉండగా... ఇప్పటికే రూ.1400 కోట్లకుపైగా ఆర్జించామని వివరించారు.