దొడ్డిదారి పందారం
పనులన్నీ నామినేషన్ పద్ధతిపైనే..
వేల కోట్ల మేర అవినీతి.. నీరు - చెట్టు పేరుతో నిధుల స్వాహా..
అన్ని శాఖలనూ దోచుకుంటున్న తమ్ముళ్లు
పాతికశాతం పని కూడా చేయకుండానే నిధులు కైంకర్యం
► చంద్రబాబునాయుడి అవినీతి విశ్వరూపంలో అనేక అవతారాలు నిన్నటి సంచికలో చూశాం. ఇరిగేషన్ నుంచి ఇసుక వరకు.. సోలార్ టెండర్ల నుంచి కరెంటు కొనుగోళ్ల వరకు బాబుగారి అవినీతి వ్యవహారాలకు అంతే లేదు.
► దొరికినంత దోచుకోవడమే ధ్యేయం. అందుకు అడ్డువచ్చే నిబంధనలను మార్చేయడం.. లేదంటే ఏమార్చడం.. కుదరకపోతే పూర్తిగా పక్కకు నెట్టేయడం.. ఇదీ చంద్రబాబు ప్రభుత్వ తీరు.. తమ్ముళ్ల సంక్షేమం కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.
► అధికారం చేపట్టిన మూడునెలల్లోనే పాత నిబంధనలను పక్కనపెట్టి పనుల ‘నామినేషన్’ పద్ధతులన్నీ మార్చేశారు. పనుల మొత్తం రూ. 5 లక్షలు మించరాదన్న పాత నిబంధనను మార్చి రూ. 10 లక్షలకు పెంచారు. ఆ తర్వాత అన్ని శాఖలలోనూ పనులన్నీ తమ్ముళ్లకు పంచడం ప్రారంభించారు.
► కేటాయించిన పనులు సక్రమంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. 25 శాతం కూడా ఖర్చు పెట్టకుండా నిధులన్నీ కైంకర్యం చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ పనుల అవకతవకలపై విజిలెన్స్ విభాగం నివేదికలు తయారు చేసింది. అయితే యథాప్రకారం ఆ నివేదికలను బాబుగారు బుట్టదాఖలా చేసేశారు...
అంతులేని అధికార దుర్వినియోగం
అన్ని జిల్లాల్లో ఎన్టీఆర్ ట్రస్టుకు భూములు - ఆ చేత్తో దరఖాస్తు... ఈ చేత్తో అనుమతి
అధికారంలో ఉంటే మన చేతికి అడ్డేముంటుంది?.. ఎడాపెడా అనుమతులిచ్చేసుకోవచ్చు. మనమే దరఖాస్తు చేసుకుని మనమే ఆమోదించేసుకోవచ్చు.. గతంలో ఎక్కడా కనీవినీ ఎరుగని తీరులో చంద్రబాబు ఈ సాంప్రదాయానికి తెరతీశారు. పార్టీ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకుని విలువైన ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేస్తున్నారు. ఇప్పటికి మూడు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు ఇలా భూములు కేటాయిస్తూ జీవోలు జారీ చేసుకున్నారు. అంతూ దరీ లేని అధికారదుర్వినియోగానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ..
ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో విలువైన ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కోసం భూమిని అభ్యర్థిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు చైర్మన్‌గా దరఖాస్తు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దానిని ఆమోదించుకున్నారు. అంటే తానే దరఖాస్తు చేసుకుని తానే ఆమోదించుకున్నారన్నమాట. ఇపుడు కూడా అదే విధానాన్ని రాష్ర్టమంతా అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం నడిబొడ్డున సర్వే నం. 700-1లో 1.29 ఎకరాలు, సర్వే నంబర్ 701-1లో 0.71 ఎకరాల భూమిని గతంలో పురపాలక శాఖ అవసరాల కోసం సేకరించారు. ఆ రెండెకరాల భూమికి ఏడాదికి రూ. 25 వేలను లీజుగా నిర్ణయించి 99 ఏళ్లపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు అప్పగిస్తూ ఆగస్టు 4న ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నడిబొడ్డున సర్వే నంబర్ 60/1లో రెండువేల చదరపు గజాల భూమిని 99 ఏళ్లపాటు ఎన్టీఆర్ భవన్‌కు లీజుకిస్తూ ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేశారు. దీని విలువ రూ. 25 కోట్లకు పైమాటే. అలాగే కడప నగరం నడిబొడ్డున ఎకరం స్థలాన్ని రూ. 10 లక్షల నామమాత్రపు ధరకు కేటాయించుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ. 50 కోట్లకు పైనే ఉంటుంది. ఇదే తరహాలో మిగిలిన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ భూములను నామమాత్రపు ధరలకు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది.
అవినీతికి కేరాఫ్ నామినేషన్
ఆ నాలుగు శాఖలను దున్నేస్తున్న తమ్ముళ్లు రూ. 500కోట్లు
తెలుగుతమ్ముళ్లకు ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచిపెట్ట డానికే నామినేషన్ దందాకు ప్రభుత్వం తెరతీసింది. ముఖ్యమైన నాలుగు శాఖల్లో ఇలా నామినేషన్ పద్ధతిన కేటాయించిన పనులు (నీరు-చెట్టు కాకుండా) రూ. 695 కోట్ల మేర ఉంటాయని అంచనా. వీటిలో దాదాపు రూ. 500 కోట్ల వరకు నిధులను కైంకర్యం చేశారని అధికారులం టున్నారు. నామినేషన్ పద్ధతిన కేటాయించే పనులన్నీ రూ.10 లక్షలలోపువి.. చిన్నచిన్నవి కావడంతో ఆడిటింగ్ ఉండడం లేదు. నీటి పారుదల శాఖలో రూ. 350 కోట్లు, పురపాలక శాఖలో రూ. 75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ. 120 కోట్ల విలువైన పనులను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారు. రహదారులు భవనాల శాఖలో రూ. 150 కోట్ల విలువైన పనులను టీడీపీ నేతలకు సంతర్పణ చేశారు.. నామినేషన్ పద్ధతిన కేటాయించిన పనులపై పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. ఎక్కడా ఆడిటింగ్ జరిపించిన దాఖలాలు లేవు. 2014లో ఒక్క రహదారులు భవనాల శాఖ పరిధిలోనే రూ. 80 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో టీడీపీ నేతలకు కట్టబెట్టారు. అయితే అనంతపురం, గుంటూరు జిల్లాల్లో చేపట్టిన పనుల్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. అయితే ఆ నివేదికను రాష్ర్టప్రభుత్వం బుట్ట దాఖలా చేసింది.
గత తొమ్మిదేళ్ల హయాంలో
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. ప్రభుత్వ సంస్థలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి అయినవారికి అతి తక్కువ ధరలకు విక్రయించారు. 1998లో ఆయన అధికారం చేపట్టినప్పటినుంచి 2004లో పదవినుంచి దిగిపోయేదాకా భూపందేరాలు చేస్తూనే వచ్చారు. విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా వినకుండా మణికొండలో గోల్ఫ్‌కోర్సు, రియల్ ఎస్టేట్ కోసం 534 ఎకరాలు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన చరిత్ర ఆయనదే. అలాగే రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అవసరమున్నా లేకున్నా రూ.1.60 లక్షల కోట్ల విలువైన 17,434 ఎకరాల భూమిని అప్పనంగా కేటాయించేశారు.
ప్రభుత్వ సంస్థలు పరాధీనం...
మరోవైపు ప్రభుత్వ సంస్థలను అప్పులపాల్జేసి, అనంతరం అస్మదీయులకు చౌకధరలకు అమ్మివేశారు. ఉదాహరణకు ఆల్విన్, సనత్‌నగర్ భూముల మార్కెట్ విలువ రూ.150 కోట్లు ఉండగా... కేవలం మూడంటే మూడు కోట్ల రూపాయలకు అమ్మివేయడం చంద్రబాబు ఆశ్రీత పక్షపాతానికి, అవినీతి పాలనకు నిదర్శనం. నిజాం కాలంనుంచి చెరుకు రైతులకు అండగా నిలిచిన నిజాం షుగర్స్‌ను నిలువునా అమ్మేశారు. ఇలా రూ.636 కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను కేవలం రూ.203 కోట్లకు విక్రయించి.. భారీగా ముడుపులు అందుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
నీరు-చెట్టు పేరుతో పందేరం రూ.1800 కోట్లు
25శాతం పనులు..75శాతం కమీషన్లు...
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టింది మొదలు రాష్ట్రంలో అవినీతి వేయిపడగల విషనాగులా పల్లె పల్లెకూ విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన నీరు-చెట్టు కార్యక్రమం అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు కల్పతరువుగా మారిపోయింది. అసలు పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టారన్న విమర్శలున్నాయి.ఈ పథకం కింద పనులకు టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిపైన కేటాయిస్తున్నారు. నీరు-చెట్టు కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏకంగా రూ.2444.90 కోట్ల విలువైన పనులు నామినేషన్లపై కేటాయించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా.
నీరు-చెట్టు పనులకు మాత్రం ఎక్కడా జాప్యం లేకుండా బిల్లుల చెల్లింపు చకచకా జరిగిపోతోంది. గతంలో చంద్రబాబు సర్కారు నీరు-చెట్టు పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1400 కోట్ల అప్పు చేసినప్పటికీ అందులో సగం రూ.700 కోట్ల పనులు చేసి మిగతా సగం దోచుకున్నారు.. ఈసారి మాత్రం 25శాతం మాత్రమే పనులు చేశారని, 75శాతం సొమ్ము అధికార పార్టీ నేతలు జేబుల్లో వేసుకున్నారనీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అంటే... దాదాపు రూ.1800 కోట్లకు పైబడి ప్రభుత్వ సొమ్మును అధికార పార్టీ నేతలకు దోచిపెట్టిందని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ పద్ధతిన కేటాయించే పనులన్నీ రూ. 10 లక్షలలోపు ఉండేవే. అంటే చిన్న చిన్న రోడ్లు, చెరువుల పూడికలు, మట్టిపనులు వంటివన్న మాట. వాటిలో అంతకుముందే చేసిన పనులు మరలా చేసినట్లు చూపించడం, అరకొరగా చేసి పూర్తిచేసినట్లు చూపిస్తుంటారు.
నిబంధనలు మార్చి దోపిడీ...
రూ.ఐదు లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన పనులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిపైన కట్టబెట్టడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టినప్పటికీ చంద్రబాబు సర్కారు వెనుకంజ వేయలేదు. రూ.పది లక్షల విలువైన పనుల వరకూ నామినేషన్‌పై కేటాయించవచ్చంటూ నిబంధనలను మార్చింది. ఆ తర్వాత నీరు-చెట్టు పనులన్నింటినీ రూ. పది లక్షల చొప్పున విడదీసి నామినేషన్లపై పచ్చ నేతలకు కట్టబెట్టేశారు. నీరు-చెట్టు కార్యక్రమాన్ని మరింత వేగం పెంచాలంటూ ఈ ఏడాది జనవరి 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మెమో నెంబర్ 1044/సీఏడీ-1 జారీ చేసింది. అంతే కాకుం డా క్యూబిక్ మీటర్ పూడిక తీతకు రూ.29 చొప్పున చెల్లించాలంటూ ఈ నెల 20వ తేదీన జలవనరుల శాఖ మరో మెమో జారీ చేసింది. వంద ఎకరాలు ఆయకట్టు పైగల చెరువుల్లో పూడిక తీత పనులను సాగునీటి సంఘాలకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వంద ఎకరాలలోపు ఆయకట్టు గల చెరువుల్లో పూడిక తీత పనులను జన్మభూమి కమిటీలకు అప్పగించాలని జలవనరుల శాఖ గత నెల 20వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నీరు-చెట్టు కింద చేపట్టిన పనులు, వ్యయం చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మిత్రుడికి కారుచౌకగా భూమి రూ. 338 కోట్లు
రాష్ట్ర పారిశ్రామిక రాజధానిగా పేరుగాంచిన విశాఖ నగరంలోని మధురవాడలో ప్రభుత్వ మార్కెట్ విలువల ప్రకారమే రూ. 363 కోట్ల విలువైన భూమిని రూ. 25 కోట్లకు ఐటీ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో రూ. 338 కోట్లు ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ మిత్రుడికి చెందిన ఈ - సెంట్రికల్ సొల్యూషన్స్‌కు కట్టబెట్టేందుకు ఈభూమిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర భూ పరిపాలన ప్రధానాధికారి (సీసీఎల్‌ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ (ఏపీఎల్‌ఎంఏ) ఎకరా 7.26 కోట్ల మార్కెట్ విలువ సిఫార్సు చేయగా కేబినెట్ దీనిని బుట్టదాఖలు చేసి ఎకరా రూ. 50 లక్షలకే కేటాయించాలని తీర్మానించడం గమనార్హం.
ఎకరా రూ. 7.26 కోట్ల మార్కెట్ విలువ ప్రకారం 50 ఎకరాలను ఏపీఐఐసీకి రూ. 363 కోట్లకు కేటాయించాలని అత్యున్నత నిర్ణాయక సంస్థ ఏపీఎల్‌ఎంఏ 2015 అక్టోబర్ 16వ తేదీన సమావేశమై తీర్మానించి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ ఇందుకు మూడు రెట్లు పైగా ఉంటుందని అంచనా. అయినా చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు మిత్రుడైన శ్రీధర్‌కు చెందిన ఎసెంట్రిక్ సొల్యూషన్స్‌కు కారు చౌకగా కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ దీని ధరను తగ్గించి ఇవ్వాలని తీర్మానించింది. కేబినెట్ నిర్ణయం మేరకు రూ. 363 కోట్ల విలువైన భూమిని రూ. 25 కోట్లకే కేటాయిస్తూ రెవెన్యూ శాఖ 2015 నవంబర్ 11వ తేదీన జీవో 428 జారీ చేసింది. ఏపీఎల్‌ఎంఏ సిఫార్సు చేసిన ధరను పూర్తిగా కేబినెట్ తగ్గించడంవల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 338 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులన్నిటినీ అంచనా వ్యయాలను ఇష్టం వచ్చిన రీతిలో పెంచుతూ కాంట్రాక్టర్లకు దోచిపెడుతోంది. ఒకవైపు ఇనుము, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయినా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అంచనా వ్యయాలను మాత్రం అమాంతం పెంచేస్తున్నారు. అందుకు ఈ రెండు ఉదంతాలే నిదర్శనం...
వంశధారలో కాంట్రాక్టర్లకు లబ్ధి రూ.214 కోట్లు
వంశధార రెండో దశ ప్యాకేజీ 86, 87 ప్యాకేజీల్లో మిగిలిపోయిన రూ. 90 కోట్ల విలువైన పనులను తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ. 429 కోట్లకు పెంచి అప్పగించనున్నారు. రూ. 100 కోట్ల విలువైన పనులైతే సీఎస్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ అనుమతించాలన్న నిబంధనను తోసిపుచ్చారు. ప్రతిఫలంగా తాజా అంచనా వ్యయంలో సగం వాటా (రూ. 214 కోట్లు) ప్రభుత్వ పెద్దలకు దక్కుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు.
నెల్లూరు బ్యారేజీకి ‘అదనం’ రూ.10 కోట్లు
నెల్లూరు బ్యారేజీ కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు జరిపేందుకు ఇరిగేషన్ నిబంధనలు తుంగలో తొక్కారు. కాంట్రాక్టరుకు రూ. 22.68 కోట్లు అదనంగా చెల్లించడానికి వీలుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో రూ.10 కోట్లు చేతులు మారాయి. ఆర్థిక శాఖ తిరస్కరించినా అధికార పార్టీ నేతలు పట్టువీడలేదు.
ఎస్‌డీఎఫ్ నిధులు పక్కదారి..
తెలుగుదేశం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది మరో ప్రబల నిదర్శనం. మద్యం దుకాణాలు, ఇసుక రీచ్‌లను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టిన ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్)ని కూడా వారికే దోచిపెడుతోంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాల కోసం స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు ఎస్‌డీఎఫ్ నుంచి నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే నిబంధనలను కాలరాసి టీడీపీ నేతల పేరుతో కేటాయింపులు సాగిస్తున్నారు. ఎస్‌డీఎఫ్ ను నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలందరికీ సమానంగా పంచాల్సి ఉండగా ముఖ్యమంత్రి విచక్షణాధికారం అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని చంద్రబాబు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నిధులు అందకుండా చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల టీడీపీ ఇన్‌చార్జిల పేరుతో నిధులు కేటాయిస్తూ ప్రత్యేక అభివృద్ధి నిధిని టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారు. కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌చార్జిలనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ వారి పేరుతో ప్రణాళికా శాఖ జీవోలు సైతం జారీ చేయడం గమనార్హం.
కుప్పం నిధిగా మారిన ఎస్‌డీఎఫ్!
ఇదే సమయంలో ఎస్‌డీఎఫ్‌ను చంద్రబాబు సర్కారు కుప్పం ప్రత్యేక నిధిగా కూడా మార్చేసింది. బాబు సర్కారు హయాంలో ఈ నిధి కేటాయింపుల తీరే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. 2015- 16 బడ్జెట్‌లో ఎస్‌డీఎఫ్ పద్దు కింద ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. సీఎం విచక్షణాధికారంతో ఈ నిధులను అన్ని నియోజకవర్గాలకు కొద్ది అటు ఇటుగా కేటాయించవచ్చు. అయితే చంద్రబాబు సర్కారు ఇందులో రూ. 273.50 కోట్లను కేవలం తన సొంత నియోజకవర్గం కుప్పానికే కేటాయించడం గమనార్హం. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని 194 తారు రోడ్డు పనులకు రూ. 136.13 కోట్లు మంజూరు చేస్తూ గత ఏడాది జులై రెండో తేదీన ప్రభుత్వం జీవో 363 జారీ చేసింది. తదుపరి ఇదే నియోజకవర్గంలోని 582 ఆవాసాల్లో సిమెంటు రోడ్డు పనులకు రూ. 137.37 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ 29వ తేదీన జీవో 349 జారీ చేసింది. ఇలా ఒకే ఆర్థిక సంవత్సరంలో సీఎం సొంత నియోజకవర్గానికి ఎస్‌డీఎఫ్ నుంచి రూ. 273.50 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇది రాష్ట్రంలోని మిగిలిన 174 నియోజకవ ర్గాలకు మంజూరు చేసిన మొత్తం కంటే ఎక్కువ. దీనివల్లే ప్రత్యేక అభివృద్ధి నిధి కాస్తా కుప్పం ప్రత్యేక నిధిగా మారిందని అధికారవర్గాలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
మిల్లర్లతో ‘చినబాబు’ బేరం రూ.200 కోట్లు
వ్యాట్‌రూపంలో రైస్, పప్పు మిల్లర్లు రాష్ట్ర విభజన తేదీనాటికి బకాయిపడిన రూ. 500 కోట్లను మాఫీ చేస్తూ ఈనెల జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రూ. 200 కోట్లకు పైగా ముడుపులు ‘చినబాబు’కు ముట్టాయని వినిపిస్తోంది. వ్యాట్ బకాయిలను చెల్లించాలంటూ వాణిజ్యపన్నుల శాఖ అధికారులు మిల్లర్లపై వత్తిడి తెచ్చారు. దాంతో చినబాబు రంగంలోకి దిగి రూ. 200 కోట్లు ముడుపులుగా ఇస్తే వ్యాట్ బకాయిలు మాఫీ చేస్తామంటూ మంత్రులతో చెప్పించారు. పాత వ్యాట్ బకాయిల రద్దుతో పాటు ఇకపై ఎగుమతి బియ్యంపై వ్యాట్‌ను రద్దు చేస్తే తాము సిద్ధమేనని మిల్లర్లు షరతు విధించారు. ఆ మేరకు వ్యాట్ బకాయిలను మాఫీ చేసి రూ.200 కోట్లు చినబాబు జేబులో వేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీసీరోడ్ల పేరుతో నొక్కేశారు రూ. 900 కోట్లు
గ్రామ పంచాయతీలకు కేంద్ర ం మంజూరు చేసిన రూ. 1217 కోట్ల నిధులను చంద్రబాబు సర్కార్ నామినేషన్ల పద్ధతిన గ్రామాల్లో తన అనుచర గణానికి కట్టబెడుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 50 శాతం, కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యే ఉపాధి హామీ పథకం నిధులు మరో 50 శాతం నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ‘వాడవాడలా చంద్రన్న బాట’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో రూ.1217 కోట్లతో 3,043 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకొంది.
వీటిలో ఎక్కువ భాగం ఐదేసి లక్షల విలువైన చిన్నచిన్న పనులను ముక్కలుగా విభజించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా గ్రామాల్లో అధికార పార్టీ అనుచరులకు నామినేషన్ల పద్ధతిన పనులు అప్పగించారు. వారు ఇందులో 25 శాతం నిధులతో పనులు చేసి, మిగతా మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అంటే రూ.1217 కోట్లలో రూ.900 కోట్లకు(75శాతం) పైబడి తెలుగు తమ్ముళ్లకే చేరుతున్నాయన్నమాట. ఇందులో రూ. 685. 60 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రూ. 531. 60 కోట్ల పనులు పూర్తికావాల్సి ఉంది. సాధారణంగా కేంద్రమిచ్చే ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు గ్రామ పంచాయతీల్లో సర్పంచుల అధికారం పనులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలపై ఆంక్షలు విధించి, ఆ డబ్బులతో అధికార పార్టీ అనుచర గణానికి నామినేషన్ల పద్ధతిన పనులు అప్పగించడం గమనార్హం.
‘గల్లా’కు భూ నజరానా రూ.40 కోట్లు
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు బాబు సర్కారు తిరుపతిలో అత్యంత విలువైన భూమిని కారు చౌకగా కట్టబెట్టింది. నగరంలో కలసిపోయినట్లున్న కడప - తిరుపతి రహదారిలోని కరకంబాడిలో రూ. 43.38 కోట్ల విలువైన భూమిని రూ. 4.88 కోట్లకే మంగల్ ఇండస్ట్రీస్‌కు ధారాదత్తం చేసింది. కేవలం ఎకరా రూ. 22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయిస్తూ 2015 నవంబర్ 12వ తేదీన రెవెన్యూ శాఖ జీవో 430 జారీ చేసింది. రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లకు, తిరుపతి బస్టాండుకు, మంగళం బస్సు డిపోకు చాలా దగ్గరగా ఉండి బాగా అభివృద్ధి చెందుతున్న కరకంబాడి ప్రాంతంలో భూమి దొరకడమే కష్టం. ఇంత కీలకమైన ప్రాంతంలో కనిష్టంగా వేసుకున్నా మార్కెట్‌లో ఎకరా విలువ రూ. 2.5 కోట్లుపైనే ఉంటుందని అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగల్ ఇండస్ట్రీస్‌కు ఎకరా రూ.22. 50 లక్షలకే కట్టబెట్టింది. గల్లా అరుణకుమారి మంత్రిగా చేయించుకోలేకపోయిన పనిని చంద్రబాబు ముఖ్యమంత్రికాగానే ఆమెకు చేసి పెట్టారు.
అస్మదీయులకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు రూ.120 కోట్లు
కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టాలని హై పవర్ కమిటీ మీద ఒత్తిడి తీసుకురావడాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ గట్టిగా వ్యతిరేకించారు. అయితే తాను చెప్పిన వారికి కాంట్రాక్టు ఇవ్వాల్సిందేనన్న పట్టును ముఖ్యమంత్రి విడిచిపెట్టలేదు. ఫలితంగా.. రూ. 413 కోట్ల విలువైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు అస్మదీయునికి కట్టబెట్టేశారు. అందులో రూ. 120 కోట్ల వరకు కాంట్రాక్టరుకు లబ్ధి చేకూరనుందని అధికారవర్గాలంటున్నాయి.
గొడ్డుమర్రిలో ఘరానా మోసం రూ. 25 కోట్లు
గొడ్డుమర్రి ఆనకట్ట కాంట్రాక్టు అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు వచ్చే విధంగా ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. అధికారులు అంగీకరించకపోయినా సీఎం రమేష్ ఒత్తిడి ఫలితంగా గొడ్డుమర్రి ఎస్‌కేడీ సర్కిల్‌కు మారిపోయింది. దాంతో రూ. 88 కోట్ల విలువైన కాంట్రాక్టు సీఎం రమేష్ చేతిలో పడింది. ఈ ప్రాజెక్టులో కాంట్రాక్టరుకు రూ. 25 కోట్ల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ఇరిగేషన్ వర్గాలంటున్నాయి.